ప్రతిదీ రాజకీయం చేయటం టీడీపీకి అలవాటైపోయింది..చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

  • Publish Date - September 16, 2019 / 10:56 AM IST

ఏపీ మాజీ స్పీకర్ కోడెల మరణాన్ని రాజకీయ కోణంలో చూడనవసరం లేదని…ప్రతి అంశాన్ని టీడీపీ రాజకీయ చేయడం దురదృష్టమని  ప్రభుత్వ చీఫ్ విప్ జీ  శ్రీకాంతరెడ్డి అన్నారు. కోడెల అకాల మరణం దురదృష్టకరమని…కోడెల కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలియచేశారు.

రాజకీయంగా ఎంతో అనుభవం కల వ్యక్తిని  రాష్ట్రం కోల్పోవటం చాలా బాధ కలిగిస్తోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కోడెల మృతిపై అనుమానాలు ఉంటే చట్టపరిధిలో అవి తేలుతాయని ఆయన అన్నారు. నిద్దర లేచిన దగ్గర నుంచి ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకోవటం టీడీపీ వారి నైజమని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. 

వాస్తవాలు తెలుసుకోకుండా టీడీపీ నాయకులు మాట్లాడడం సరికాదని..సీనియర్ నేత చనిపోయాడు అనే బాధ కూడా  లేకుండా వైసీపీపై బురద జల్లుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని…పోస్టుమార్టం రిపోర్ట్ లో వాస్తవాలు తెలుస్తాయని శ్రీకాంత్ రెడ్డి పేర్కోన్నారు.