Two Boats Collide In Assam : బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవలు మునక ….100 మందికి పైగా గల్లంతు

అసోంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న రెండు పడవలు బ్రహ్మాపుత్ర నదిలో బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో దాదాపు వంద మందిపైగా నీటిలో గల్లంతైనట్లు తెలుస్తోంది.

Assam Boats Accident

Two Boats Collide In Assam : అసోంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న రెండు పడవలు బ్రహ్మాపుత్ర నదిలో బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో దాదాపు వంద మందిపైగా నీటిలో గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశం గౌహతి కి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాగా తాజాగా అందిన సమాచారం ప్రకారం  గల్లంతైన వారిలో 40 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

జోర్హాత్‌ జిల్లా నీమాటిఘాట్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పడవ బోల్తా పడిన సమయంలో ఈత వచ్చిన కొందరు ప్రయాణికులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. ఈత రాని వారు మునిగిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు (ఎన్డీఆర్‌ఎఫ్‌- ఎస్డీఆర్‌ఎఫ్‌) రంగంలోకి దిగాయి. నీటిలో గల్లంతయిన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి.

ఈ ఘటనపై కేంద్ర షిప్పింగ్.. ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఒక పడవ మజులి (బ్రహ్మపుత్ర నదిలోని ఒక నదీ ద్వీపం) నుండి నీమాటిఘాట్‌  వైపు వస్తోంది, మరొక పడవ వ్యతిరేక దిశలో వెళుతోంది. ఇవి రెండు ఢీ కొట్టుకోవటంతో ప్రమాదం సంభవించింది.

ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో వెంటనే ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఘటనకు గల కారణాలు కూడా తెలుసుకుంటున్నారు. నదిలో ఈ రెండు పడవలు ఢీకొన్నాయని సమాచారం.  ప్రస్తుతం   ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తూ… నదీ ప్రవాహం అధికంగా ఉండడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి  హిమంత్ బిశ్వశర్మ రేపు ఘటనా స్ధలాన్ని సందర్శిస్తారు.

ప్రమాద వార్త తెలియగానే రాష్ట్ర మంత్రి బిమల్ బోరాను వెంటనే మజులీకి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని  ముఖ్యమంత్రి ఆదేశించారు. అక్కడి పరిణామాలను పర్యవేక్షించాల్సిందిగా ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ సమీర్ కుమార్ సిన్హాను సీఎం  కోరారు.