Headmaster With Machete : సాధారణంగా పిల్లలకు పాఠాలు నేర్పించే టీచర్ కానీ హెడ్ మాస్టర్ కానీ.. స్కూల్ కి వేటితో వెళ్తారు. చేతిలో టెక్ట్స్ బుక్కులు లేదా పేపర్లతో స్కూల్ కి వెళ్తారు. ఇది కామన్. టీచర్ల చేతిలో అతి కామన్ గా కనిపించే వస్తువులివే. ఇందులో పెద్ద వింతేమీ లేదు. కానీ, ఓ స్కూల్ హెడ్ మాస్టర్ చేతిలో కొడవలితో స్కూల్ కి వెళ్లడం కలకలం రేపింది. టీచర్లను, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేసింది. ఈ షాకింగ్ ఘటన అసోంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అసోంలోని కచర్ జిల్లాలో ఒక ప్రాథమిక పాఠశాల హెడ్ మాష్టార్ కొడవలితో స్కూల్ కి వచ్చాడు. కొడవలిని భుజాన పెట్టుకుని తరగతి గదులను పరిశీలించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హెడ్ మాస్టర్ చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు. పుస్తకాలు పట్టాల్సిన చేత్తో ఆయుధం పట్టుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. అసలాయన కొడవలితో స్కూల్ కి ఎందుకొచ్చాడనేది హాట్ టాపిక్ గా మారింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఈ వ్యవహారం దుమారం రేపడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. సదరు హెడ్ మాస్టర్ పై వేటు వేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సైతం రంగంలోకి దిగారు. హెడ్ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. హెడ్ మాస్టర్ కొడవలితో స్కూల్ కి ఎందుకొచ్చారు అనేది ఆరా తీస్తున్నారు.
టీచర్లు విధులు సరిగా నిర్వర్తించకపోవడంతో కాస్త అసహనానికి గురై హెడ్ మాస్టర్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీచర్ల క్రమశిక్షణ కోసమే ఆయనిలా ప్రవర్తించినట్లు కచర్ జిల్లా పాఠశాలల డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ పర్వేజ్ హజారీ తెలిపారు.
ప్రస్తుతం ఆ హెడ్ మాస్టర్ ను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. పోలీసులకు ఆ హెడ్ మాస్టర్ నుంచి రెండు నోట్లు లభించాయి. తనకేదైనా జరిగితే ఆ నలుగురు టీచర్లే కారణమని ఒక దానిలో ఉంది. తాను ముగ్గురు టీచర్లను చంపాలనుకున్నట్లు మరో నోట్ లో హెడ్ మాస్టర్ రాశాడని పోలీసులు తెలిపారు.
ఆయుధంతో స్కూల్ కి వెళ్లిన ఆ హెడ్ మాస్టర్ పేరు దృతిమేధ దాస్. వయసు 38ఏళ్లు. రాధామాధవ్ బునియాడీ స్కూల్ లో గత పదేళ్లుగా టీచర్ గా పని చేస్తున్నారు. హెడ్ మాస్టర్ ఆయుధంతో స్కూల్ కి వెళ్లడం దుమారం రేపడంతో ఉన్నతాధికారులు దాస్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే, ఆయనపై పోలీసులకు ఫిర్యాదు మాత్రం చేయలేదు.