హైదరాబాద్ పాతబస్తీలో మరో దారుణం చోటు చేసుకుంది. అక్కాచెళ్లెళ్లపై కన్నేసిన కామాంధులు గదిలో నిర్బంధించి అఘాయిత్యానికి ఒడిగట్టారు.
మొన్న దిశ, నిన్న అక్కాచెల్లెళ్లు. అక్కడ లారీ డ్రైవర్లు.. ఇక్కడ ఆటోడ్రైవర్లు. హైదరాబాద్ పాతబస్తీలో మరో దారుణం చోటు చేసుకుంది. అక్కాచెళ్లెళ్లపై కన్నేసిన కామాంధులు గదిలో నిర్బంధించి అఘాయిత్యానికి ఒడిగట్టారు. కాళ్లావేళ్లా పడ్డ కనికరించని కిరాతకులు… బలవంతంగా తమ కామవాంఛ తీర్చుకున్నారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వదిలిపెట్టారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో.. ఆ మృగాళ్లు ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నారు.
దిశ హత్యోదంతం మర్చిపోకముందే హైదరాబాద్‌లో మరో దారుణమైన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలో రాత్రి రోడ్డుపై నిలబడ్డ ఇద్దరు అక్కాచెళ్లెళ్లపై కన్నేసిన కామాంధులు.. వారికి మాయమాటలు చెప్పి దారుణానికి ఒడిగట్టారు. విషయం బయటకు చెబితే చెల్లెలిని చంపేస్తామని బెదిరించారు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని హషామాబాద్‌లో చోటు చేసుకుంది.
మూసా, అమీర్.. ఇద్దరూ ఆటోడ్రైవర్లు. హషామాబాద్ ప్రాంతానికి చెందిన అక్కాచెల్లెల్లు రాత్రి పూట రోడ్డుమీద నిలబడి ఉండటం వీరి కంటపడింది. వారి దగ్గరకు వెళ్లి ఎక్కడికి వెళ్లాలని అడిగారు. జాహంగీర్ పీర్ దర్గా వద్ద ఉన్న తమ బంధువుల ఇంటికి వెళుతున్నామని చెప్పడంతో.. ఆటోలో దింపుతామంటూ నమ్మించారు. కొంత దూరం వెళ్లాక రాత్రివేళల్లో అక్కడికి వెళ్లడం మంచిది కాదని.. ఇటీవలే దిశ అనే అమ్మాయిని రేప్ చేసి చంపేశారంటూ నమ్మబలికారు.
అక్కాచెళ్లెళ్లకు మాయమాటలు చెప్పి మూసా ఇంటికి తీసుకువెళ్లారు. వారిని గదిలో నిర్బంధించి చంపేస్తామంటూ బెదిరించారు. తరువాత ఇద్దరిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. కనికరం కూడా చూపకుండా ఆ కసాయిలు అక్కాచెల్లెల్లకు చిత్రహింసలు పెట్టారు. చివరకు వారిద్దరిని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో వదిలి పారిపోయారు. తమ ఇద్దరు పిల్లలు ఇంటికి రాకపోవడంతో బాలికల తల్లిదండ్రులు చాంద్రాయణగుట్ట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. అన్ని పోలీస్‌స్టేషన్‌లలో లుక్ అవుట్ నోటీస్‌తో పాటు పెట్రొలింగ్ గస్తీ టీమ్‌ను రంగంలోకి దింపారు.
నాంపల్లి రైల్వేస్టేషన్ అక్కాచెళ్లెళ్లు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. తీవ్ర రక్తస్రావం జరగడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా ఆటోడ్రైవర్ల అఘాయిత్యాలు బయటపడ్డాయి. దీంతో మరోసారి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలికలను ఆసుపత్రికి తరలించిన పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా ఆటో నెంబర్ కనుగొన్నారు. ఘాతుకానికి పాల్పడిన కామాంధులు మూసా, అమీర్‌లను అరెస్టు చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ తరలించారు. అటోతోపాటు నిందితుల సెల్‌ఫోన్లను సీజ్ చేశారు.