హైదరాబాద్ లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఏకంగా లెక్చరరే కేటుగాడి అవతారం ఎత్తాడు. మెడికల్ సీట్లకు ఉన్న డిమాండ్ ను సొమ్ముగా చేసుకున్నాడు. మెడికల్
హైదరాబాద్ లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఏకంగా లెక్చరరే కేటుగాడి అవతారం ఎత్తాడు. మెడికల్ సీట్లకు ఉన్న డిమాండ్ ను సొమ్ముగా చేసుకున్నాడు. మెడికల్ సీట్లు ఇప్పిస్తానని కోటి రూపాయలు కొట్టేశాడు. మెడికల్ కాలేజీ సీట్ల పేరుతో రూ. 1.40 కోట్లు కొల్లగొట్టిన ఘరానా లెక్చరర్ ని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని కృష్ణాజిల్లా విసన్నపేట మండలానికి చెందిన అరిగె వెంకటరామయ్య అలియాస్ ఏవీఆర్ ఫిజిక్స్‌లో పీజీ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. మంచి జీతం ఉన్నా.. అదనపు ఆదాయం కోసం అడ్డదారి తొక్కాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఏవీఆర్ ఇన్‌స్టిట్యూట్ పేరిట నీట్ కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. మేనేజ్‌మెంట్ కోటాలో మెడికల్ సీట్లు ఇప్పిస్తానని ప్రచారం చేసుకున్నాడు. ఇది నమ్మిన ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు 2018 ఏప్రిల్‌లో అతడికి రూ.1.40 కోట్లు చెల్లించారు. ఎంతకీ సీటు రాకపోగా.. ఏవీఆర్ ముఖం చాటేస్తూ ఉండటంతో తాము మోసపోయామని బాధితులు గుర్తించారు. వెంటనే ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లెక్చరర్ ని పట్టుకున్నారు. అరెస్ట్ చేసి లోపలేశారు. అతడికి సహకరించిన ఏవీఆర్ ఇన్‌స్టిట్యూట్ రిసెప్షనిస్టు యాగా శ్రావణిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
తన దగ్గర శిక్షణ తీసుకున్న విద్యార్థులకు అందరికీ ఎంబీబీఎస్ సీట్లు వస్తాయని లేకుంటే మేనేజ్‌మెంట్ ‘బి’, సి కేటగిరి సీట్లు ఇప్పిస్తానని ఏవీఆర్ విద్యార్థులకు హామీ ఇచ్చాడు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడానని డబ్బులు ఇస్తే సీట్లు ఇస్తారని విద్యార్థుల తల్లిదండ్రులతో చెప్పాడు. వారు వెంకటరామయ్య మాటలు నమ్మి డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత ఇది ఫ్రాడ్ అని తెలుసుకుని కంగుతిన్నారు. నిందితులపై ఎల్బీ నగర్, జగిత్యాల జిల్లా కోరుట్లలో కేసులు నమోదయ్యాయి.
ఎల్బీ నగర్ కి చెందిన గడ్డగోజు పరమేష్ చారి, వెంకట రామయ్య ఇద్దరు స్నేహితులు. ప్రైవేట్ కాలేజీలో మేనేజ్‌మెంట్ సీట్లు ఇప్పిస్తానని వెంకట రామయ్య చెప్పడంతో 2018 ఏప్రిల్ 11న రూ.17లక్షలు క్యాష్ డీడీ రూపంలో చారి ఇచ్చాడు. అంతేకాకుండా తనకు తెలిసిన నరేష్, వంశీ, సత్యనారాయణలను వెంకటరామయ్యకి పరిచయం చేశాడు. వారి నుంచి వెంకటరామయ్య రూ.1.40కోట్లు కట్టించుకున్నాడు. డబ్బు తీసుకున్నా ఎంతకీ సీట్లు ఇవ్వకపోడంతో మోసపోయామని బాధితులు గ్రహించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టయ్యింది. ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ముందూ వెనుకా ఆలోచన చేయకుండా, నిజాలు తెలుసుకోకుండా డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.