ఉమ్మడి కరీనంగర్ జిల్లాలో గంజాయి దందా జోరుగా సాగుతోంది.
కరీనంగర్ : ఉమ్మడి కరీనంగర్ జిల్లాలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. ఓ వైపు అక్రమ సాగు, మరోవైపు అక్రమ రవాణ.. వెరసి.. అక్రమార్కులు కోట్ల రూపాయలు గడిస్తున్నారు. గంజాయి దమ్ముకు అలవాటుపడిన యువత…మత్తులో జోగుతూ భవిష్యత్‌ను చిత్తు చేసుకుంటున్నారు.
అడవులను ఆనుకుని ఉన్న పంట పొలాల్లో అంతర్ పంటగా గంజాయి సాగువుతోంది. బంతిపూల తోటలు, పత్తి, మిరప, కంది, జొన్న చేలల్లో చాటుమాటుగా ఈ పంటను సాగు చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని సైదాపూర్ మండలం కుర్మపల్లెలో ఓ రైతు చేనులో భారీగా సాగవుతున్న గంజాయిని చూసి పోలీసు అధికారులే ఖంగుతిన్నారు…. కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలోని పోలీసులు బృందం.. గంజాయి మొక్కలను కూకటివేళ్లతో పీకేసి.. పంట మొత్తాన్ని ధ్వంసం చేశారు. గంజాయి సాగే కాదు… స్మగ్లింగ్ కూడా భారీగా జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. కొత్తపల్లిలో ఇటీవల ప్రమాదానికి గురైన ఓ కారులో గంజాయి లభించడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. దీంతో ఈ దందాపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో కూడా భారీగా గంజాయి పట్టుపడింది. కారులో తరలిస్తున్న 150 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు విడుతల్లో 41 లక్షల రూపాయల విలువైన గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి సీలేరు, భద్రాచలం, కరీంనగర్, రామగుండం మీదుగా కర్నాటక తరలిస్తున్న అంతర్‌రాష్ట్ర స్మగ్లింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
జగిత్యాల జిల్లాలో కూడా గంజాయి అక్రమ దందా సాగుతోంది. గంజాయిని తరలిస్తున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కిలోన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కిలో గంజాయికి మార్కెట్‌లో 30 వేల రూపాయల ధర పలుకుతోంది. సీలేరు, ఒడిశా ప్రాంతాల్లో కిలో రెండు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు స్మగ్లర్లు కొనుగోలు చేస్తారు. దీనిని మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు అక్రమార్కులైతే పోలీసుల కళ్లు కప్పి దందా సాగించేందుకు వీలుగా గంజాయి రవాణా చేసే వాహనాలకు పోలీసు స్టిక్కర్లు అంటిస్తున్నారు. అలాగే కొన్ని కార్లకు రెండు, మూడు నంబర్ ప్లేట్లు మారుస్తూ గంజాయి అక్రమ రవాణ చేస్తున్న వైనం కూడా పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఉమ్మడి కరీనంగర్ జిల్లాలో గంజాయి సాగు.. రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.