Massive fraud in Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ లో ఘరానా మోసం జరిగింది. అల్లాద్దీన్ దీపం పేరుతో ఓ వైద్యుడిని ఇద్దరు మోసగించారు. ఈ ఘటన మేరఠ్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భారత్ కు చెందిన లయీక్ అనే వ్యక్తి లండన్ నుంచి తిరిగి వచ్చి యూపీలో డాక్టర్ గా పని చేస్తున్నాడు. తాంత్రిక శక్తులు, మాయలు, మంత్రాల పేరుతో ఇద్దరు వ్యక్తులు డాక్టర్ కు దగ్గరయ్యారు. 2018 నుంచి ఓ మహిళ ఈ డాక్టర్ దగ్గరికి తన శస్త్ర చికిత్సకు సంబంధించి తరచూ ఆరోగ్య పరీక్షలకు వస్తుండేది.
మహిళ ద్వారా తాంత్రికుడి పేరుతో చలామణి అవుతున్న ఇస్లాముద్దీన్ అనే మరో వ్యక్తి వైద్యుడికి పరిచయం అయ్యాడు. తనకు తాంత్రిక శక్తులు ఉన్నట్లు డాక్టర్ ను నమ్మించాడు. తన దగ్గర అల్లాద్దీన్ దీపం ఉందని దాన్నుంచి బయటికి వచ్చే భూతం అద్భుతాలు చేస్తుంటుందని వివరించారు. అయితే అప్పుడప్పుడు భూతం ఆకారాన్ని ఇస్లాముద్దిన్ డాక్టర్ కు చూపించాడు.
ఈ దీపం దగ్గర ఉంటే కోటీశ్వరుడివి అవుతావని చెప్పి డాక్టర్ కు దాన్ని రూ.2.5 కోట్లకు అమ్మాడు. ఆ డబ్బు మొత్తాన్ని డాక్టర్ వాయిదాల పద్ధతిలో చెల్లించాడు. ఆ దీపాన్ని తన ఇంటికి తీసుకెళ్తానని అడిగిన ప్రతిసారి వాళ్లు వైద్యుడిని భయపెట్టేవాళ్లు. దీని నుంచి వచ్చే భూతం వల్ల చెడు జరుగుతుందని వైద్యుడిని అనేక సార్లు నమ్మించారు. దీంతో మోసపోయానని గ్రహించిన డాక్టర్ జిల్లా ఎస్పీని అశ్రయించాడు.
ఇస్లాముద్దీన్, అతని స్నేహితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. భూతం ఆకారంలో కనిపించిన వ్యక్తి డాక్టర్ దగ్గరకు ఆరోగ్య పరీక్షలకు వచ్చే మహిళ భర్తగా గుర్తించారు. వారిని కూడా అదుపులోకి తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.