Chittoor Drugs Racket : చిత్తూరు జిల్లాలో డ్రగ్స్ కలకలం రేగింది. విద్యార్థులకు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆరుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల్లో ఒకరు సుడాన్ దేశస్తుడు. వీరి నుంచి రూ.2లక్షల విలువైన MDMA డ్రగ్స్ ను(34 గ్రాములు) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మూడు సెల్ ఫోన్లు, వెయింగ్ మిషన్, డ్రగ్స్ వాడేందుకు ఉపయోగించే సిరంజిలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సుడాన్ దేశస్తుడు అహ్మద్ ఒమర్ నుంచి పాస్ పోర్టు, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్, వీసా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసు సిబ్బందిని.. ఎస్పీ అభినందించారు.
చిత్తూరు కేంద్రంగా ఇదొక పెద్ద డ్రగ్స్ రాకెట్ గానే పోలీసులు అనుమానిస్తున్నారు. చిత్తూరుకు చెందిన సిరాజ్ కు బెంగళూరులో ఉంటున్న ఒమర్ పరిచయం అయ్యాడు. సుడాన్ నుంచి డ్రగ్స్ తెప్పించి బెంగళూరులో విక్రయించే వాడు ఒమర్. సిరాజ్ పరిచయం కావడంతో ఒమర్ డ్రగ్స్ తీసుకుని చిత్తూరు వచ్చాడు.
చిత్తూరులో మరో ఆరుగురుని కలిశారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. సుడాన్ నుంచి వచ్చే డ్రగ్స్ ను చిత్తూరులో విక్రయిస్తున్నారు. చిత్తూరు, తిరుపతి పరిధిలో ఉన్న అనేక ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీ విద్యార్థులకు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పూర్తిగా వలపన్ని చిత్తూరు పోలీసులు.. 8 సభ్యుల ముఠాను గుర్తించారు. అయితే కేవలం ఆరుగురు దొరికారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారం సూత్రధారి సుడాన్ కు చెందిన ఒమర్ గా గుర్తించారు పోలీసులు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
కొంతమంది ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. అన్ని కాలేజీలకు సర్కులర్ జారీ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే తల్లిదండ్రులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని, పిల్లలపై కన్నేసి ఉంచాలని సూచించారు. డ్రగ్స్ అలవాటు పడ్డ పిల్లలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని చిత్తూరు ఎస్పీ వెల్లడించారు.
అయితే, డ్రగ్స్ కు అలవాటు పడ్డ విద్యార్థుల పేర్లను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. చాలాకాలంగా ఈ డ్రగ్స్ దందా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోంది. ప్రధాని నిందితుడు సుడాన్ కు చెందిన ఒమర్ ను పోలీసులు పట్టుకున్నారు. సుడాన్ నుంచి బెంగళూరు మీదుగా ఒమర్ కు డ్రగ్స్ వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అతడి దగ్గర దొరికినది చాలా ప్రమాదకరమైన మత్తుపదార్ధం అని పోలీసులు వెల్లడించారు. దీన్ని MDMA డ్రగ్ గా పిలుస్తారు. దీన్ని గ్రాములుగా (అర గ్రాము, ఒక గ్రాము) విక్రయిస్తారు. ఈ ముఠా నుంచి పోలీసులు పెద్ద సంఖ్యలో (34 గ్రాములు) మత్తుపదార్దం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో లోతైన దర్యాఫ్తు కొనసాగుతోంది.