బీహార్ లో ఓ కాంగ్రెస్ నేతను కాల్చి చంపారు. శనివారం (డిసెంబర్ 28, 2019) 6.30 గంటల ప్రాంతంలో వైశాలిలోని సినిమా రోడ్డులో కాంగ్రెస్ నేత రాకేశ్ యాదవ్‌ను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. మీనాపూర్ గ్రామంలోని రాకేశ్ యాదవ్ ప్రతి రోజు ఉదయం తన ఇంటి నుంచి సుమారు 3 కిలోమీటర్ల మేర మార్నింగ్ వాక్ చేస్తారు.
సినిమా రోడ్డులోని ఓ జిమ్‌లో వ్యాయామం చేసి ఇంటికి తిరిగి వెళ్తారు. ఈ క్రమంలో జిమ్ దగ్గర మాటు వేసిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రాకేశ్ యాదవ్‌పై ఐదు రౌండ్ల కాల్పులు జరిపి, అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న యాదవ్‌ను స్థానికులు చికిత్స కోసం సఫ్దర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
రాకేశ్ యాదవ్ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. జిమ్ దగ్గర ఉన్న సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.