నగరంలో కలకలం రేపిన వరుస చైన్ స్నాచింగ్స్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దొంగల బండిని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బైక్‌ను కనుకొన్నారు.
హైదరాబాద్: నగరంలో కలకలం రేపిన వరుస చైన్ స్నాచింగ్స్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దొంగల బండిని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బైక్‌ను కనుకొన్నారు. బండి నెంబర్ TS 08 EP 4005. విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. బైక్‌ను ఓఎల్ఎక్స్‌లో అద్దెకి తీసుకుని నిందితులు స్నాచింగ్‌లకు పాల్పడినట్టు తేలింది. బైక్ నంబర్ ద్వారా దాని యజమానిని సంప్రదించగా అతను రెండేళ్ల క్రితమే బైక్‌ను అమ్మేసినట్టు వెల్లడించాడని పోలీసులు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గంటల వ్యవధిలో 9 స్నాచింగ్స్ జరిగాయి. దీన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. గొలుసు దొంగల కోసం వేటను ముమ్మరం చేశారు.
ఓఎల్ఎక్స్‌లో అద్దెకి:
పాతబస్తీకి చెందిన వ్యక్తి నుంచి ఓఎల్ఎక్స్‌లో బైక్‌ను అద్దెకు తీసుకుని దుండగులు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. చైతన్యపురి, వనస్థలిపురం, హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో చోరీ చేసి తిరిగి బైక్‌ను భవానీనగర్‌లో ముళ్లపొదలో వదిలేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. తలాబ్ కట్టా ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో బైక్ నెంబర్ ఆధారంగా ఈ విషయాలు బయటపడ్డాయి. బైక్ అద్దెకిచ్చిన యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
15గంటల వ్యవధిలో 9 చోరీలు:
2018, డిసెంబర్ 27 గురువారం ఒక్కరోజే హైదరాబాద్‌లో తొమ్మిది చైన్ స్నాచింగ్‌లు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గొలుసు దొంగల కోసం నగరం మొత్తం కోసం జల్లెడ పడుతున్నారు. గొలుసు దొంగతనాలపై స్పందించిన హోమంత్రి మహముద్ అలీ ఇతర రాష్ట్రాల నుంచి ముఠాలు వచ్చినట్టు ప్రాథమికంగా గుర్తించామని, నిందితులను త్వరగా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించామని చెప్పారు.