చటాన్ పల్లి దగ్గర ఎన్ కౌంటర్ కు గురైన దిశ హత్యాచార నిందితుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సోమవారం(డిసెంబర్ 9,2019) సాయంత్రం మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి మృతదేహాలను తీసుకొచ్చారు. మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో నిందితుల మృతదేహాలు భద్రపరచటానికి సరైన వ్యవస్ధ లేదని యాజమాన్యం పోలీసుల దృష్టికి తీసుకొచ్చింది. దీంతో పోలీసులు ఈ విషయాన్ని హైకోర్టుకు తెలిపారు. మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించాలని హైకోర్టు ధర్మాసనం అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు.
శుక్రవారం(డిసెంబర్ 13,2019) వరకు మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు సూచించింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదావేసింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం..ఇదే కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. దిశ ఎన్ కౌంటర్ విచారణలో సీనియర్ అడ్వకేట్ ప్రకాష్ రెడ్డిని మధ్యవర్తిగా నియమించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితులైన జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులు, మహ్మద్ ఆరిఫ్ లను పోలీసులు తమ ఆత్మరక్షణలో భాగంగా డిసెంబర్ 6న చటాన్‌పల్లి దగ్గర ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్ కౌంటర్ పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అయితే పలు మహిళాలు ఫిర్యాదు చేయడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగింది. ఎన్ కౌంటర్ లో నిజాలు నిగ్గు తేల్చేందుకు దర్యాఫ్తు చేపట్టింది.