బ్రాండెడ్ పేరుతో నకిలీ వస్తువుల అమ్మకం..ముఠా వ్యక్తి అరెస్ట్

  • Publish Date - November 9, 2019 / 09:21 AM IST

ఒకసారి వాడిన పారేసిన వస్తువులను మళ్లీ రీప్యాక్ చేసి.. ఆ వస్తువులకు బ్రాండెడ్ కంపెనీ పేరు పెట్టి..తక్కువ ధరలకు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను హైదరాబాద్ ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు బయటపెట్టారు. శుక్రవారం (నవంబర్ 8, 2019)న వారిలో ఓ నిందితుడైన జగదీష్ ను అరెస్ట్ చేయగా.. అతని దగ్గర  భారీగా నకిలీ వస్తువులు, వివిధ బ్రాండ్ ల ఖాళీ బాక్సులు ఉన్నాయని డీసీపీ రాధాకిషన్ రావు తెలిపారు. 

గుజరాత్ లోని కచ్ ప్రాంతానికి చెందిన జగదీష్ అంబాబాయ్ రవారియా పదేళ్ళ క్రితం కుటుంబంతో కలిసి హైదరాబాద్ వచ్చి పంజాగుట్టలో నివసిస్తున్నాడు. కొన్నాళ్ల పాటు సీటీలోని ఓ కంప్యూటర్ల షాపులో పని చేశాడు. అందులో ప్రింటర్ లో ఉపయోగించే వస్తువులపై అనుభవం సంపాదించాడు. వచ్చే జీతం సరిపోక, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దానితో నకిలీ వస్తువులను కొత్త బ్రాండ్ వస్తువులగా మార్చి అమ్మాలని ఆలోచనతో రసూల్ పుర్ లో ఒక షాపును అద్దెకు తీసుకున్నాడు. 

ఇక ఆ షాపులోకి అవసరమైన వస్తువులను ముంబైలో తక్కువ దరకు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఒకసారి వాడిన వస్తువులను.. బ్రాండ్ కంపెనీ పేర్లతో ఉన్న డబ్బాల్లో లేదా ప్యాకెట్లలో పెట్టి తక్కువ ధరకి వాటిని అమ్మేవాడు. ఇలా మొసం చేస్తూ సుఖంగా జీవనం సాగిస్తున్న సమయంలో… నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అతని వ్యాపారం పై దాడి చేశారు. ఆ దాడిలో ఖాళీ బ్రాండెడ్ బాక్సులు పట్టుకున్నారు. దానితో నిందితుడు జగదీష్ ను అదుపులోకి తీసుకుని బేగంపేట పోలీసులకు అప్పగించారు.