ఉన్న ఊరులో పని లేదు. తినడానికి తిండి లేదు. కుటుంబాన్ని పోషించుకోవడానికి దారి లేదు. దీంతో పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం దేశం కాని దేశం కాని వెళ్లాడు. అక్కడ ఉపాధి
ఉన్న ఊరులో పని లేదు. తినడానికి తిండి లేదు. కుటుంబాన్ని పోషించుకోవడానికి దారి లేదు. దీంతో పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం దేశం కాని దేశం వెళ్లాడు. అక్కడ ఉపాధి మాటేమో కానీ.. ఊహించని పరిణామం జరిగింది. ఉరిశిక్ష పడింది. ఇది ఓ శ్రీకాకుళం జిల్లా వాసి దీనగాథ.
ఈజిప్ట్‌లో శ్రీకాకుళం జిల్లావాసికి ఉరిశిక్ష పడింది. డ్రగ్స్ కేసులో బగ్గు రమణకు స్థానిక కోర్టు మరణ శిక్ష విధించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రణమను క్షేమంగా తీసుకురావాలని అధికారులను వేడుకుంటున్నారు. దీని గురించి తెలుసుకున్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి రాయబార కార్యాలయంతో మాట్లాడి బాధితుడిని క్షేమంగా భారత్‌కు రప్పించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం రూరల్ మండలం చంద్రయ్యపేటకు చెందిన బగ్గు రమణ ఇంటర్ వరకు చదువుకున్నాడు. తర్వాత విశాఖకు చెందిన ఓ ఏజెంట్ ద్వారా విదేశాల్లో సీమెన్‌గా పనిచేసేందుకు ఒప్పందం చేసుకున్నాడు. అందుకు డబ్బు కూడా చెల్లించాడు. 2016లో ముంబై నుంచి ఇరాన్ వెళ్లాడు. అక్కడ అబ్బాన్ సిరదౌసీ కంపెనీ షిప్‌లో సీమెన్‌గా చేరాడు. ఈ షిప్ ఈజిప్ట్ జలాల్లోకి ప్రవేశించడంతో.. అక్కడ భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఆ షిప్‌లో డ్రగ్స్ ఉండటంతో.. రమణను అరెస్ట్ చేశారు.
రమణను ఈజిప్ట్ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు మరణ శిక్ష విధించింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం కూడా లేదు. దీంతో వారు ఏజెంట్‌ను నిలదీయగా.. అతడు సరిగా జవాబు ఇవ్వలేదు. జులైలో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో వినతిపత్రం ఇచ్చారు. రమణ ఆచూకీ తెలియడం లేదని.. సాయం చేయాలని కోరారు. తర్వాత ఏపీ పోలీస్ ఎన్‌ఆర్‌ఐ విభాగం నుంచి రమణకు సంబంధించిన సమాచారం వచ్చింది. డ్రగ్స్ కేసులో రమణ ఈజిప్ట్ పోలీసులకు పట్టుబడ్డాడని.. కోర్టు మరణశిక్ష విధించిందని తెలిసింది.
మరణ శిక్ష గురించి తెలిసిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విషయాన్ని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. గురువారం(నవంబర్ 21,2019) బాధిత కుటుంబసభ్యులను తీసుకెళ్లి విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. చేయని తప్పుకి రమణను బలి చేశారని వివరించారు. దీనికి మంత్రి కూడా సానుకూలంగా స్పందించారని, ఈజిస్ట్ రాయబార కార్యాలయం అధికారులతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారని తెలుస్తోంది. కాగా, రమణ క్షేమంగా తిరిగిరావాలని కుటుంబసభ్యులు, స్నేహితులు, స్థానికులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.