ముగ్గురు చిన్నారుల గొంతుకోసిన తండ్రి : ఇద్దరు మృతి

  • Publish Date - April 17, 2019 / 02:34 AM IST

సంగారెడ్డి : రామచంద్రాపురం బొంబాయి కాలనీలో దారుణం జరిగింది. కన్నపిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కత్తితో ముగ్గురు పిల్లల గొంతుకోశాడు. ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ కలహాలే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆర్ సీ పురం దగ్గర ఉన్న కంజర్ల గ్రామానికి చెందిన కుమార్.. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో ఈఎస్ ఐ ఆస్పత్రి పక్కన ఉన్న బాంబే కాలనీలో నివాసముంటున్నారు. అయితే కుమార్ మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగి వచ్చి నిత్యం భార్యతో గొడవపడుతుంటాడు. భార్యాభర్తల మధ్య రోజూ గొడవ జరుగుతోంది.

ఈనేపథ్యంలో పిల్లలను చూసైనా అతడిలో మార్పువస్తుందేమోనని భావించిన భార్య.. పిల్లలను ఇంట్లోనే వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన కుమార్.. ఏప్రిల్ 16 మంగళవారం రాత్రి కత్తితో ముగ్గురు పిల్లల గొంతుకోశాడు. దీంతో అఖిల్ (7), శరణ్య (4) అక్కడికక్కడే మృతి చెందారు. మళ్లేశ్వరి (10) పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.