Uttar Pradesh Incident : ఇంత కిరాతకమా.. పక్కింటికి వెళ్తోందని ఐదేళ్ల కూతురిని కడతేర్చిన తండ్రి..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఇంతలోనే ఓ ప్రాంతంలో చిన్నారి శరీర భాగాలు లభ్యమయ్యాయి.

Uttar Pradesh Incident : కన్న బిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే దారుణానికి ఒడిగట్టాడు. అర్థం లేని ఆవేశంతో అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. కన్న కూతురిని తండ్రే కడతేర్చాడు. తన కూతురు పక్కింటికి వెళ్తోందనే ఒకే ఒక్క కారణంతో అతడు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. కూతురిని చంపిన ఆ కిరాతకుడు.. మృతదేహాన్ని మాయం చేసి తప్పించుకోవాలని చూశాడు. కానీ, అతడి ప్లాన్ వర్కౌట్ కాలేదు. పోలీసులకు దొరికిపోయాడు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్ లో ఈ దారుణం జరిగింది. మోహిత్ శర్మ (40) అనే వ్యక్తి తన ఐదేళ్ల వయసుకున్న కూతురిని కడతేర్చాడు. ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత తనకేమీ తెలియనట్లు బిల్డప్ ఇచ్చాడు. నా కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురిని వెతికి పెట్టాలని వేడుకున్నాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఇంతలోనే ఓ ప్రాంతంలో చిన్నారి శరీర భాగాలు లభ్యమయ్యాయి. తొలుత.. ఏదో జంతువు చేసిన దాడిలో పాప చనిపోయి ఉంటుందని అంతా అనుకున్నారు.

కానీ, పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయం బయటపడింది. చిన్నారి ఊపిరి ఆడక మరణించిందని తేలింది. అంతే, పోలీసులకు చిన్నారి తండ్రిపై అనుమానం కలిగింది. అతడిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్ లో విచారణ చేశారు. నాలుగు తగిలించారు. అంతే, అతగాడు నిజం కక్కేశాడు.

కూతురిని తానే కడతేర్చినట్లు ఒప్పుకున్నాడు. ఎందుకు చంపావు అని పోలీసులు అడిగితే.. అతడు చెప్పిన సమాధానం విని పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. తన పక్కింటి వారితో తనకు గొడవలు ఉన్నాయని, అయితే.. తన కూతురు వారి ఇంటికి తరచుగా వెళ్లేదని, అది తనకు నచ్చలేదని, ఆ కోపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టానని మోహిత్ అంగీకరించాడు.

Also Read : ఎంతకు తెగించారు.. విదేశీయులే టార్గెట్.. అమ్మాయిలను బెదిరించి.. హైదరాబాద్ లో దిమ్మతిరిగిపోయే భారీ స్కామ్..

పిల్లలకు చిన్న ఇబ్బంది కలిగినా తల్లిదండ్రులు విలవిలలాడిపోతారు. వారికి ఏ కష్టం కలగకుండా కంటికి రెప్పలా చూసుకుంటారు, కాపాడుకుంటారు. కానీ, ఈ తండ్రి చేసిన పని అందరినీ షాక్ కి గురి చేసింది. ఆ కిరాతకుడిని అత్యంత కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

గతంలో మోహిత్ తన పక్కింట్లో ఉండే కుటుంబంతో చాలా క్లోజ్ గా ఉండే వాడు. వాళ్ల ఇంట్లోకి వీళ్లు, వీళ్ల ఇంట్లోకి వాళ్లు.. ఇలా రాకపోకలు సాగేవి. ఈ క్రమంలో మోహిత్ కూతురు పక్కింటి వారికి బాగా దగ్గరైంది. తరుచుగా వారి ఇంట్లోకి వెళ్లేది. వారితో ఆడుకునేది. అయితే, కొన్ని రోజుల క్రితం రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దాంతో ఇరు కుటుంబాలు మాట్లాడుకోవడం, కలవడం మానేశాయి.

పక్కింటి వాళ్లపై తీవ్రమైన కోపం పెంచుకున్న మోహిత్.. వాళ్ల ఇంటికి వెళ్లొద్దని తన కుమార్తెను చాలాసార్లు హెచ్చరించాడు. అయితే, పాప ఆడుకోవడానికి అక్కడికి వెళ్తూనే ఉంది. ఇది మోహిత్ కు అస్సలు నచ్చలేదు. ఘటన జరిగిన రోజున కూడా తన కూతురు పక్కింటి నుంచి వస్తుండటం తాను గమనించానని చెప్పాడు. అంతే, తీవ్రమైన కోపంతో.. కూతురిని బైక్ పై నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి కడతేర్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ కేసుని సవాల్ తీసుకున్న పోలీసులు 100 మంది ప్రశ్నించారు. చివరికి పాపను చంపింది తండ్రే అని తేల్చారు.