బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం : 70 మంది సజీవదహనం

  • Publish Date - February 21, 2019 / 02:32 AM IST

ఢాకా : బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 20 బుధవారం రాత్రి 10.40 గంటల సమయంలో ఢాకాలో చౌక్‌బజార్‌ అపార్ట్‌మెంట్‌లోని రసాయనాల గోదాములో గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 70 మంది సజీవదహనం అయ్యారు. వందలాది మందికి గాయాలయ్యాయి. పక్కనే ఉన్న మరో నాలుగు భవనాలకు మంటలు వ్యాపించాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. 200 మంది ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అగ్నిమాపక అధికారి అలీ అహ్మద్‌ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

చౌక్ బజార్.. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. దుకాణ సముదాయాలు, నివాసాలు ఒకే చోట ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. చిన్న చిన్న రోడ్లు, ట్రాఫిక్ అధికంగా ఉండటంతో అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు పారిపోవడానికి సమయం లేకపోవడంతో మృతుల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య పెరిగింది. నివాస ప్రాంతాల మధ్య గోడౌన్ లో రసాయనాలను ఉంచడం వల్ల అగ్నికిలల ప్రభావం అధికమైంది. ప్రమాద తీవ్రత ఎక్కువైంది. మంటలు ఇతర బిల్డింగ్స్ కు అంటుకున్నాయి.

ఇరుకైన రోడ్లు ఉండటం వల్ల అక్కడున్న ప్రజలు బయటికి వెళ్లడానికి చోటులేకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇరుకు రోడ్లు, రద్దీ కారణంగా ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునేందుకు ఆలస్యమైంది. దీంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది. నిన్న రాత్రి నుంచి అగ్నిమాపక సిబ్బంది ఆపరేషన్ కొనసాగుతోంది. 2010లో చౌక్ బజార్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 120 మంది మృతి చెందారు.