గోనె సంచిలో శవం.. చేపల వ్యాపారి కిడ్నాప్, హత్య

  • Publish Date - February 5, 2020 / 02:35 AM IST

హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌ పోలీసు స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ లో  గోనె సంచిలో శవం తీవ్ర కలకలం రేపింది. ఇంటి పెంట్ హౌస్ లో  గోనె సంచిలో శవం లభ్యం అయ్యింది. జవహర్‌నగర్‌‌ ప్రాంతంలో చేపల వ్యాపారం చేసుకునే రమేష్ ను  నిందితులు హత్య చేసి గోనె సంచిలో కట్టి పడేసినట్లు పోలీసులు గుర్తించారు. 

హైదరాబాద్‌ బోరబండలోని రామారావు నగర్ కు చెందిన చేపల వ్యాపారి రమేష్‌ను గుర్తు తెలియని దుండగులు ఫిబ్రవరి 1వ తేదీన  కిడ్నాప్ చేశారు.  2వ తేదీ  ఉదయం రమేష్ సెల్ ఫోన్ నుంచి అతని కోడలు ఫోన్ కు కొన్ని మెసేజ్ లు వచ్చాయి. బాగా మద్యం సేవించాడని… వాంతులయ్యాయని.. నిద్ర లేవగానే తోలుకు వస్తానని మెసేజ్ లు వచ్చాయి. ఆ తర్వాత ఇంక రమేష్ సెల్ ఫోన్ అందుబాటులో లేకుండా పోయింది. అనుమానం  వచ్చిన కుటుంబ సభ్యులు 2వ తేదీ మధ్యాహ్నం ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3వతేదీ మధ్యాహ్నం మళ్లీ రమేష్ సెల్ ఫోన్ నుంచి  వాట్సప్ మెసేజ్ వచ్చింది. 

రమేష్ ను కిడ్నాప్ చేశామని…రూ.90 లక్షలు ఇస్తే వదిలిపెడతామని.. లేదంటే చంపేస్తామని కుటుంబ సభ్యులను బెదిరించారు. 4వతేదీ మంగళవారం మధ్యాహ్నం  లోపు డబ్బులు ఇవ్వాలని డెడ్‌లైన్ పెట్టారు. అలర్టైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద రమేష్ ను కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే…. మంగళవారం సాయంత్రం జవహర్ నగర్ లోని ఒక ఇంటి పెంట్ హౌస్ లో శవాన్ని గుర్తించారు. ఇంటి నుంచి దుర్వాసన రావటంతో ఆ ఇంటి యజమాని శివ రామ్ కుమార్ తాళం పగల కొట్టి చూడగా.. గోనె సంచిలో కట్టిపడేసిన మృతదేహం కనపడింది. 

ఇంటి యజమాని సమాచారంతో పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకోగా ఆ శవం చేపల వ్యాపారి రమేష్ గా గుర్తించారు. అప్పటికే శవం కుళ్లిపోయి..మోకాళ్లు మడిచి… చేతులు వెనక్కి మడిచి విరిచి కట్టిన స్ధితిలో మృతదేహం ఉంది. దుండగులు అడిగిన సమయంలోపు డబ్బులు అందకపోవడంతో అతడిని కిరాతకంగా చంపేశారు. కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేసి  దానిపై దర్యాప్తు జరగుతున్న క్రమంలోనే రమేశ్ శవమై కనిపించాడు.  

ఇదే సమయంలో శివరామ్ కుమార్ లో అద్దెకు ఉంటున్న  శ్రీనివాస్ అరుణ అనే మహిళ..పిల్లలు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. దుండగులు రమేష్ ను కిడ్నాప్ చేసి శ్రీనివాస్ రూమ్ కు తీసుకు వచ్చినట్లు గుర్తించారు. ఈ మర్డర్ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లిహిల్స్ పరిధిలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.  ఇప్పటి వరకు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.  వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.