నిర్భయ నిందితుల ఉరిశిక్ష అమలుకు 5 అడ్డంకులు

నిర్భయపై అత్యాచారం జరిగిన రోజు డిసెంబర్‌ 16న రేపిస్టులకు ఉరిశిక్ష అమలయ్యే ఛాన్స్‌ కనిపించడం లేదు. ఇంతకీ ఉరిశిక్ష అమలుకు ఎదురువుతున్న అడ్డంకులేంటి?

  • Publish Date - December 13, 2019 / 02:41 AM IST

నిర్భయపై అత్యాచారం జరిగిన రోజు డిసెంబర్‌ 16న రేపిస్టులకు ఉరిశిక్ష అమలయ్యే ఛాన్స్‌ కనిపించడం లేదు. ఇంతకీ ఉరిశిక్ష అమలుకు ఎదురువుతున్న అడ్డంకులేంటి?

నిర్భయపై అత్యాచారం జరిగిన రోజు డిసెంబర్‌ 16న రేపిస్టులకు ఉరిశిక్ష అమలయ్యే ఛాన్స్‌ కనిపించడం లేదు. కనీసం నిర్భయ తుదిశ్వాస విడిచిన డిసెంబర్‌ 29న నిందితులను ఉరితీస్తారా? లేక 2020 నాటికి వాయిదా వేస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకీ ఉరిశిక్ష అమలుకు ఎదురువుతున్న అడ్డంకులేంటి?   

హైదరాబాద్, ఉన్నావ్‌ రేప్‌ మర్డర్‌ ఘటనలతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. దిశ నిందితులను  ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని ప్రజలు  స్వాగతించారు. ఈ నేపథ్యంలో నిర్భయ కేసులో నిందితులకు  ఉరిశిక్ష ఎపుడు అమలు చేస్తారన్న వాదన తెరపైకి వచ్చింది. ఏడేళ్లవుతున్నా నిర్భయం కేసు  నిందితులకు శిక్షపడలేదు. నలుగురు నిందితులు ముకేశ్, పవన్, అక్షయ్, వినయ్‌లను ఉరి  తీయడంలో జరుగుతున్న జాప్యానికి ఐదు అడ్డంకులు ప్రధానంగా కనిపిస్తున్నాయి.

మొదటి అడ్డంకి
మొదటి అడ్డంకి ఏంటంటే…ఉరిశిక్ష అమలులో జరుగుతున్న జాప్యంపై నిర్భయ తల్లి ఈ ఏడాది  అక్టోబర్‌లో పటియాలా హౌస్‌కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు-  నలుగురు నిందితుల కేసుపై తాజా నివేదిక ఇవ్వాలని తీహార్‌ జైలు డీజీకి నోటీసు జారీ చేసింది.  అంతేకాదు.. నలుగురు నిందితులను డిసెంబర్‌ 13న కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది. దీంతో  డిసెంబర్‌ 13 లోపు ఉరిశిక్ష వేసే అవకాశం లేకుండా పోయింది.

రెండో అడ్డంకి
రెండో అడ్డంకి ఏంటంటే…నలుగురు దోషులలో ఒకరైన వినయ్ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి  పిటిషన్‌ పెట్టుకున్నాడు. ఈ పిటిషన్‌ రాష్ట్రపతికి చేరింది. అయితే దీనిపై రాష్ట్రపతి భవన్‌ ఇంకా తుది  నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రపతి భవన్‌ నుంచి తుది నిర్ణయం వెలువడే వరకు ఉరిశిక్ష వేయడం  కుదరని పని.

మూడో అడ్డంకి
మూడో అడ్డంకి ఏంటంటే…నిర్భయ కేసులో మరో నిందితుడు అక్షయ్ సింగ్  డిసెంబర్‌ 10న  పెట్టుకున్న రివ్యూ పిటీషన్‌ని సుప్రీంకోర్టు డిసెంబర్ 17న విచారించబోతోంది.. సుప్రీంకోర్టు నిర్ణయం  వెలువడే వరకూ హంతకులకు ఉరిశిక్ష అమలు జరగదని తేలిపోయింది.

నాల్గో అడ్డంకి
నాలుగో అడ్డంకి ఏంటంటే…ఒకవేళ డిసెంబర్‌ 13న పటియాలా కోర్టులో విచారణ సందర్భంగా  -ఇద్దరు నిందితులు ముకేష్‌, పవన్‌ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి అప్పీలు చేసుకున్నా ఇబ్బందులు  తప్పవు. దీంతో ఉరిశిక్ష వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు రాష్ట్రపతిని ఎందుకు   క్షమాభిక్ష కోరలేదని కోర్టు నిందితులను ప్రశ్నించవచ్చు. క్షమాభిక్ష పిటిషన్‌కి అనుమతి  నిరాకరించినప్పటికీ కొంత సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితులలో నలుగురు నిర్భయ  నిందితులకు తక్షణమే ఉరి తీసే అవకాశం లేదు. ఒకటి లేదా రెండు వారాలు పట్టినా  ఆశ్చర్యపోనక్కరలేదు.

ఐదో అడ్డంకి
2104లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించడం, బ్లాక్‌ వారెంట్‌ జారీ  చేసినప్పటికీ వెంటనే నిందితులను ఉరి తీయలేరు. బ్లాక్‌ వారెంట్‌ జారీ అయ్యాక కూడా నిందితులకు  కనీసం రెండు వారాల సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూసినా ఉరిశిక్ష అమలు  చేసేందుకు మరో రెండు వారాల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద సోషల్ మీడియాలో ప్రచారం జరగుతున్నట్టు ఉరిశిక్ష అమలు అంత త్వరగా జరిగే అవకాశం కనిపించడం లేదు. అయితే ఈ ప్రచారంతో  ఉరిపై కదలిక మాత్రం వచ్చిందని చెప్పవచ్చు.