×
Ad

Forest Range Officer Killed : భద్రాద్రి కొత్తగూడెంలో ఘోరం.. ఫారెస్ట్ రేంజర్‌ను నరికి చంపిన గుత్తికోయలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఓ ఫారెస్ట్ రేంజర్ ను గుత్తికోయలు నరికి చంపారు.

  • Published On : November 22, 2022 / 06:24 PM IST

Forest Range Officer Killed : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుత్తికోయల దాడిలో గాయపడిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ చేస్తున్న మొక్కలను గుత్తికోయలు నరుకుతుండగా.. ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో గుత్తికోయలు కత్తులు, గొడ్డళ్లు, వేట కొడవళ్లతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయనను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస రావు మృతి చెందారు.

విధి నిర్వహణలో ఉన్న ఓ ఫారెస్ట్ రేంజర్ ను గుత్తికోయలు నరికి చంపడం కలకలం రేపింది. జిల్లాలోని చండ్రగుంట మండలం బెండలపాడు వద్ద ఎర్రగూడు అటవీ ప్రాంతంలో గుత్తికోయలు పోడు వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఈ భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటారు. స్థానిక గిరిజన జాతి అయిన గుత్తికోయలు.. అధికారులు నాటిన మొక్కలను తొలగించేందుకు పలుమార్లు ప్రయత్నించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ వ్యవహారంలో.. గతంలో ఓసారి ఫారెస్ట్ అధికారులకు, గుత్తికోయలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా, లాఠీచార్జి కూడా చేయాల్సి వచ్చింది. తాజాగా, ఫారెస్ట్ అధికారులు ఆ భూముల్లో మరోసారి మొక్కలు నాటగా, వాటిని ధ్వంసం చేసేందుకు గిరిజనులు యత్నించారు.

ఫారెస్ట్ రేంజర్ చలమల శ్రీనివాసరావు (42) అడ్డుకోగా, గుత్తికోయలు ఆయనపై వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను అటవీశాఖ సిబ్బంది కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో శ్రీనివాస రావు మరణించారు. గుత్తికోయలు.. వెంటాడి మరీ వేట కొడవళ్లతో ఫారెస్ట్ ఆఫీసర్ ను నరికి చంపడం సంచలనంగా మారింది.