Marriage Cheating
Fraudster Cheated Widow : రెండో పెళ్లి పేరుతో ఒక వితంతు మహిళ వద్ద నుంచి రూ. 50 లక్షలు ట్రాన్సఫర్ చేయించుకున్న కేటుగాడి ఉదంతం హైదరాబాద్‌లో వెలుగు చూసింది. హైదరాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (34) భర్త చనిపోవటంతో రెండో పెళ్లి చేసుకోటానికి తన ప్రోఫైల్‌ను ఒక ప్రముఖ మ్యాట్రిమోనీ సైట్‌లో రిజిష్టర్ చేసుకుంది.
ఆమె ప్రోఫైల్ చూసి విజయ్ ఆనంద్ అనే వ్యక్తి ఆమెను సంప్రదించాడు. తాను ఇటలీలో డాక్టర్‌ని అని..తనకు అక్కడ క్లినిక్ ఉందని పరిచయం చేసుకున్నాడు. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో స్ధిరపడతానని ఆమెతో చెప్పాడు. అతను చెప్పిన వివరాలు నచ్చటంతో మహిళ ఆవ్యక్తితో మాట్లాడటం మొదలుపెట్టింది. పరిచయం అయిన కొద్ది రోజుల్లోనే మహిళ వద్ద నమ్మకం పొందగలిగాడు.
ఇటలీలో ఉన్న తన విలువైన వస్తువులను ఎయిర్ కొరియర్ ద్వారా నీకు పంపిస్తున్నానని చెప్పాడు. నిజమని నమ్మిన మహిళ ఒప్పుకుంది. కొద్దిరోజుల తర్వాత ఒక మహిళ చేత ఢిల్లీ కస్టమ్స్ అధికారినంటూ వేరే వారితో ఫోన్ చేయించి, ఇటలీ నుంచి మీకు పార్సిల్ వచ్చింది… వాటికి టాక్స్‌లు చెల్లించాలని చెప్పి విడతల వారీగా వివిధ పన్నుల రూపంలో రూ.50 లక్షలు ట్రాన్సఫర్ చేయించుకున్నాడు.
మళ్లీ ఇంకో రూ. 30 లక్షలు కట్టాలని కస్టమ్స్ అధికారి నుంచి ఫోన్ రావటంతో …తాను మోసపోయానని గ్రహించిన మహిళ గత శనివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.