కేరళకు చెందిన ఓ విద్యార్థిని జర్మనీలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అలప్పుజా జిల్లాకు చెందిన అనిలా అచ్చన్ కుంజు అనే 27ఏళ్ల యువతి ఫ్రాంక్ ఫర్ట్ యూనివర్శిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెన్స్ లో ఎమ్ టెక్ చదవుతుంది. అయితే సోమవారం రాత్రి అనిలా తన హాస్టల్ రూమ్ లో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. యూనివర్శిటీ ఆవరణలో ఉండే విద్యార్థుల వసతి గృహంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆదివారం(డిసెంబర్-8,2019)రాత్రి వరకూ తాము పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ, తమ కుమార్తె నుంచి ఎలాంటి స్పందన రాలేదని అనిలా తల్లిదండ్రులు అన్నారు. సోమవారం ఫ్రాంక్ ఫర్ట్ లో నివసించే తమ బంధువు జానీ ఫోన్ చేసి మీ కూతురు చనిపోయింది అని చెప్పాడని అనిలా తండ్రి అచ్చన్ కుంజు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అనిలా కుటుంబ సభ్యులు ఫ్రాంక్ ఫర్ట్ కు బయలుదేరి వెళ్లారు. తమ కుమార్తెది ఆత్మహత్య చేసుకునేంతటి బలహీన మనస్తత్వం కాదని, దీని వెనుక గల కారణాలను వెలికి తీయాలని వారు కోరుతున్నారు.
ఈ మేరకు జర్మనీలోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. 2016లో అనిలా తల్లి మోనీ మరణించారు. అదే ఏడాది అనీలా జర్మనీకి వెళ్లారు. తల్లి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి అనిలా 2018లో చివరిసారిగా కేరళకు చేరుకున్నారు. అప్పటి నుంచి ఆమె మళ్లీ స్వరాష్ట్రానికి వెళ్లలేదు. చివరి సంవత్సరం కావడం వల్ల పరీక్షలను ముగించుకుని ఒకేసారి వస్తానని తనకు సమాచారం ఇచ్చిందని, అంతలోనే ఇలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందనుకోలేదని అచన్ కుంజు ఆవేదన వ్యక్తం చేశారు.