గుంటూరు జిల్లా గురజాలలో కలకలం రేగింది. గురజాల దేవాదాయశాఖ ఈవో అనిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దాచేపల్లి మండలం పొందుగల కృష్ణా నదిలో అనిత మృతదేహం గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈవోది హత్యా, ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
ఈవో అనితపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీనిపై దేవాదాయశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. మూడు రోజుల క్రితం అనితను విధుల నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు భార్యభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో అనిత పుట్టింటిలోనే ఉంటున్నారు. అటు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడం, ఇటు భర్తతో మనస్పర్థలు.. దీంతో మనస్తాపంతో అనిత ఆత్మహత్య చేసుకున్నారా లేక హత్య చేసి నదిలో మృతదేహం పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. అనితకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.
దైదతో పాటు గురజాలలోని ఆలయంలోనూ అనిత ఈవోగా ఉన్నారు. లెక్కలు చూపించకుండా అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై దేవాదాయశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. అభియోగాలు నిజమే అని రుజువు కావడంతో నవంబర్ 18న అనితను విధుల నుంచి సస్పెండ్ చేశారు. అనిత మృతితో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. దేవాదాయశాఖ ఉద్యోగులు షాక్ కి గురయ్యారు.