కంట్లోంచి రక్తంతో కాపాడమంటూ పోలీసులకు ట్వీట్ చేసిన మహిళ

భారత్ కు చెందిన దంపతుల గొడవ షార్జాలో రచ్చగా మారింది. సోషల్ మీడియా వేదికగా చేసిన మహిళ ఆక్రందనలకు పోలీసులు స్పందించి నిందితుడ్ని గంటల వ్యవధిలో అరెస్టు చేశారు. జాస్మిన్ సుల్తాన్(33) అనే మహిళ ఓ కంట్లోంచి రక్తం కారుతూ నవంబరు 12న తనను కాపాడమంటూ ట్వీట్ చేసింది. 

‘నన్ను అర్జెంటుగా కాపాడండి. నా పేరు జాస్మిన్ సుల్తాన్. నేను దుబాయ్‌లోని షార్జాలో భర్తతో కలిసి ఉంటున్నాను. అతని పేరు మొహమ్మద్ ఖైజర్ ఉల్లా. అతను నన్ను రోజూ వేధిస్తున్నాడు. నన్ను కాపాడండి’ అని ఓ వీడియోను పోస్టు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని 47ఏళ్ల నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. 

ఏడేళ్ల క్రితం వివాహం జరగ్గా వారికి ఐదేళ్ల కొడుకు, 17నెలల బాబు ఉన్నారు. బాధితురాలు.. భర్త తనను వేధిస్తున్నాడని పాస్ పోర్టు, బంగారం తన నుంచి లాగేసుకున్నాడని ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక్కడే ఉండి చిన్నారులను పోషించుకోవడానికి డబ్బులు లేవని బెంగళూరులోని తన పుట్టింటికి తనను పంపేయాలని మహిళ కోరుతుంది.