జయరాం కేసు: టీడీపీ మాజీ మంత్రి కొడుకుతో రాకేష్‌కి లింకులు

  • Publish Date - February 25, 2019 / 10:08 AM IST

హైదరాబాద్: వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి టీడీపీ నేతలతో  సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం బయటపడటం కలకలం రేపుతోంది. 2014, 19 ఎన్నికల్లో తెలంగాణ టీడీపీలో రాకేష్‌ కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. టికెట్లు  ఇప్పిస్తానంటూ బేరసారాలు సాగించడమే కాకుండా భారీగా నగదు చేతులు మార్చే విషయంలో కీ రోల్ ప్లే చేసినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రాకేష్ అక్రమాలపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, మాజీ కార్పొరేటర్లతో రాకేష్‌కి దగ్గరి సంబంధాలు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. త్వరలో  మరికొందరు కీలక వ్యక్తులకు నోటీసులు పంపి అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో టీడీపీ నేత బీఎన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాకేష్‌తో ఉన్న సంబంధాల  గురించి ఆరా తీస్తున్నారు. వరుసగా 2వ రోజు కూడా అతడిని విచారిస్తున్నారు. టీడీపీ మాజీ మంత్రి కుమారుడితోనూ రాకేష్ రెడ్డికి సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ మాజీ మంత్రి  ఎవరు అనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

జయరాం మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి నేర చరిత్రపై పోలీసులు ఫోకస్ చేశారు. హత్య కేసులో నిందితులు ఎవరు, రాకేష్‌కి ఎవరెవరు సహకరించారు అనే వివరాలు ఆరా  తీస్తున్నారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ నేతలతో రాకేష్‌కి ఉన్న లింకులు బయటపడుతున్నాయి. ఓ మాజీ కార్పొరేటర్, టీడీపీ నేతకు వెపన్ లైసెన్స్  ఉందని.. ఆ వెపన్‌ ద్వారా రాకేష్‌ వారితో కలిసి కొన్ని సెటిల్‌మెంట్లు చేశాడని, కొందరిని బెదిరించాడని పోలీసుల ఎంక్వైరిలో తెలిసింది. ఈ అంశంపై క్లారిటీ కోసమే పోలీసులు పలువురు టీడీపీ నేతలను పిలిపించి విచారిస్తున్నారు.