దేవుడి ప్రసాదంలో విషం : ఆమెను చంపటానికి ఆమె వేసిన ప్లాన్..

  • Publish Date - February 1, 2019 / 09:33 AM IST

బెంగళూరు : కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా చింతామణి ప్రాంతంలో గంగమ్మ ఆలయంలో ప్రసాదం తిని ఇద్దరు మరణించిన కేసు మిస్టరీని చేధించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో నిజాలు తెలుసుకుని షాక్ అయ్యారు. ప్రసాదాన్ని తయారు చేసిన లక్ష్మీ అనే మహిళే.. విషం కలిపినట్టు నిర్ధారించారు. కారణం ఏంటీ.. ఏం జరిగిందో చూద్దాం..

 

ప్రసాదంలో విషం కలిపిన లక్ష్మీ.. తాను అద్దెకు ఉంటున్న ఇంటికి ఓనర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి ఓనర్ భార్యతో గొడవకు దిగింది. ఆమెను అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేసింది. పక్కా ప్లాన్ వేసింది. ఓనర్ భార్య అయిన శ్రీగౌరికి దేవుడు అంటే భక్తి. నిత్యం ఆలయాల్లో పూజలు చేస్తూ ఉంటుంది. దీన్ని ఆసరా చేసుకుని ప్లాన్ చేసింది లక్ష్మీ. 

 

గంగమ్మ ఆలయంలో జరిగే జాతరకు శ్రీగౌరి కుటుంబ సభ్యులతో వచ్చింది. దీన్ని గమనించిన శ్రీలక్ష్మి.. దేవుడి ప్రసాదంలో విషం కలిపింది. తన సన్నిహితుల ద్వారా ఆ ప్రసాదాన్ని శ్రీగౌరికి ఇచ్చింది. అయితే ఆమె దాన్ని తినకుండా తన వెంట వచ్చిన తల్లి సరస్వతి(56)కి ఇచ్చింది. వెంటనే ఆమె అస్వస్థతకు గురైంది. అదే విధంగా విషం కలిపిన ప్రసాదం చేతులు మారుతూ.. వెళ్లిపోయింది. ఈ ఘటనలో శ్రీగౌరి తల్లి సరస్వతితోపాటు కవిత అనే మరో మహిళ చనిపోయింది. 100 మంది అస్వస్థతకు గురయ్యారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి తెచ్చారు.

 

శ్రీగౌరిని చంపేందుకే లక్ష్మీనే ప్రసాదంలో విషం కలిపినట్టు పోలీసులు నిర్థారించారు. ప్రధాన నిందితురాలు లక్ష్మితో పాటు సహకరించిన అమరావతి, పార్వతమ్మ అనే ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ వ్యవహరంలో శ్రీగౌరి భర్త లోకేశ్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆలయ నిర్వాహకులు ఎలాంటి ప్రసాదం తయారుచేయలేదని, ఇద్దరు మహిళలు పంచిన కేసరి ప్రసాదంలోనే విషం కలిపినట్టు తేలిందని పోలీసులు తెలిపారు. ఓ వివాహేతర సంబంధం వల్ల ఇద్దరు ప్రాణాలు పోవటమే కాదు.. ఎంతకి తెగించిందో కదా అంటున్నారు. ఆమెను చంపటానికి ఆమె వేసిన ప్లాన్ ఇలా బెడిసికొట్టిందని.. ఇద్దరు అమాయకురాళ్లు చనిపోవటానికి కారణం అయ్యింది అంటున్నారు.