Kerala Ig Suspended
Kerala IG Suspended : నేరస్థుడికి సహాయం చేసి, అతడితో వ్యాపార భాగస్వామిగా ఉన్నందుకు కేరళలో ఓ ఐజీ స్ధాయి అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ పోలీసు అధికారి తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి. మరి కొద్ది రోజుల్లో ఏడీజీపీగా ప్రమోషన్ పొందే సమయంలో ఆయనపై ఈ వేటు పడింది.
నకిలీ పురాతన వస్తువుల అమ్మకం కేసులో నిందితుడు, యూట్యూబర్ మోన్సన్ మవుకల్‌తో.. కేరళలో సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఐజీ లక్ష్మణ్ నాయక్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలడంతో ఆయనను సస్పెండ్ చేసినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.ఇందుకు సంబంధించిన పైలుపై ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సంతకం చేశారు.
మోన్సన్ మవుకల్‌తో కేరళకు చెందిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గత నెలలో బయటపడింది. కేరళ మాజీ డీజీపీ లోక్‌నాథ్ బెహరా, ప్రస్తుత డీజీపీ అనిల్ కాంత్‌తో… మోన్సన్ మవుకల్ సన్నిహితంగా దిగిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ఐజీ లక్ష్మణ్ నాయక్ ఏకంగా మోన్సన్ మవుకల్ నకిలీ పురాతన వస్తువుల అమ్మకం వ్యాపారంలో కూడా భాగస్వామి అని తేలింది. అందుకు ఆధారాలు కూడా దొరికాయి. మోన్సన్ మవుకల్‌తో బిజినెస్ పార్టనర్‌గా చేరాలని ఏపీకి చెందిన పలువురితో లక్ష్మణ్ నాయక్ మధ్యవర్తిత్వం వహించినట్లు కూడా తేలింది.
Also Read : Extra Marital Affair Murder : వివాహేతర సంబంధం-హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ
లక్ష్మణ్ నాయక్ తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి. కేరళ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఐజీ హోదాలో కేరళ సీఎం పినరయి విజయన్‌కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కేరళ ఐజీల్లో చాలా సీనియర్ అయిన లక్ష్మణ్ నాయక్‌కు వచ్చే జనవరి 1న అడిషనల్ డీజీపీగా ప్రమోషన్ ఖరారైంది. ఇప్పుడు సస్పెన్షన్‌కు గురికావడంతో ఆయన కేరీర్ దెబ్బతింది.
కేసు వివరాలు
కేరళలోని అలప్పుజా జిల్లాలో నకిలీ పురాతన వస్తువులను విక్రయించి కోట్లాది రూపాయల మోసే చేసినందుకు మోన్సన్ మవున్ కల్(52) ను అరెస్ట్ చేశారు. అతను కొన్నేళ్లుగా కళాఖండాలు, అవశేషాలను సేకరించే వాడిగా నటిస్తూ ప్రజలవద్దనుంచి రూ. 10 కోట్ల రూపాయల వరకు మోసం చేశాడని పోలీసులు తెలిపారు.
మోన్సన్ మవున్ కల్ తన వ్యాపార భాగస్వామి ఐజీ లక్ష్మణ్ నాయక్ సహకారంతో తిరువనంతపురం పోలీసు గెస్ట్ హౌస్ లో అతిధిగా దిగి పలువురు వ్యాపారవేత్తలతోనూ, కేరళలోని పలువురు సీనియర్ పోలీసు అధికారులతోనూ సమావేశాలు నిర్వహించాడు. వీటికి సంబంధించిన సీసీటీవీ పుటేజిలు, ఫోటోలు దొరకటంతో ప్రభుత్వం ఈకేసు విచారణచేపట్టి నాయక్ పై చర్య తీసుకుంది.