kerlala auto driver suspected to have killed sons, self : భార్యతో గొడవల కారణంగా మానసికంగా కుంగిపోయిన భర్త తన ఇద్దరు పిల్లలను చంపి తాను బలవన్మరణానికి పాల్పడిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. తిరువనంతపురం సమీపంలోని నవయిక్కులమ్ లో నివసించే సఫీర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య , 9,12 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు.
కొన్నేళ్ల క్రితం భార్య భర్తల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చి భార్య పిల్లలను తీసుకుని వేరుగా జీవిస్తోంది. సఫీర్ ఒంటరిగా జీవిస్తున్నాడు. కానీ అప్పుడప్పుడు పిల్లలిద్దరినీ తీసుకుని వచ్చి తన దగ్గర కొన్ని రోజులు ఉంచుకుని మళ్లీ భార్య దగ్గర దింపుతూ ఉండేవాడు. ఎప్పటిలాగే ఇటీవల పిల్లలిద్దరినీ తన వద్దకు తెచ్చుకుని దారుణానికి ఒడి గట్టాడు. పెద్ద కొడుకును ఇంట్లో గొంతుకోసి చంపేసి, చిన్న కొడుకుని సమీపంలోని ఆలయ కోనేరులో పడేసాడు. అనంతరం తాను కూడా కోనేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
కోనేరు ఒడ్డున సఫీర్ ఆటోను చూసిన కొందరు గాలించగా…తండ్రీ, చిన్న కొడుకు శవాలు కోనురులో బయటపడ్డాయి. సఫీర్ ఇంటికి వెళ్లి చూడగా పెద్ద కొడుకు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అయితే అంతకు ముందు రోజు రాత్రి సఫీర్ పిల్లలిద్దరినీ తిరువనంతపురం బీచ్ కు తీసుకువెళ్లాడు. వారు అడిగినవన్నీ కొనిచ్చాడు. ఇద్దరికీ కొత్త బట్టలు కొన్నాడు. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.