Khalistani Terrorist Gursevak Babla Arrested Delhi
‘ఖలిస్థాన్ కమాండో ఫోర్స్’ ఉగ్ర సంస్థకు చెందిన గుర్‌సేవక్ బాబ్లా (53)ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో ఖలిస్థాన్ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. ‘ఖలిస్థాన్ కమాండో ఫోర్స్’ ఉగ్ర సంస్థకు చెందిన గుర్‌సేవక్ బాబ్లా (53)ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయంపై మార్చి 13 బుధవారం పోలీసులు ప్రకటన చేశారు. ఈమేరకు పోలీసు అధికారులు మీడియాకు వివరాలను వెల్లడించారు. ఇన్నాళ్లు గుర్‌సేవక్ బాబ్లా పరారీలో ఉన్నాడని తెలిపారు. గతంలో రెండు సార్లు ఢిల్లీ, రాజస్థాన్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయాడని చెప్పారు. మార్చి 12 మంగళవారం రాత్రి గుర్‌సేవక్ బాబ్లా ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ (ఐఎస్‌బీటీ) వద్దకు వస్తున్నట్లు తమకు సమాచారం అందిందని, అతను అక్కడికి రాగానే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారని వెల్లడించారు.
50కి పైగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన కేసుల్లో గుర్‌సేవక్ బాబ్లా భాగస్వామిగా ఉన్నాడని పేర్కొన్నారు. పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొంతమంది పోలీసులు, వారి ఇన్ఫార్మర్లను హత్య చేసిన కేసుల్లో, బ్యాంకులు, పోలీస్ స్టేషన్‌లపై దాడులు చేసి చోరీలు చేసిన కేసుల్లోనూ ఉన్నాడని తెలిపారు. అప్పట్లో భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’లో హతమైన జర్నైల్ సింగ్ భిందెర్‌వాలాతో అతనికి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ‘ఖలిస్థాన్ కమాండో ఫోర్స్’ చీఫ్ పరంజీత్ సింగ్ పంజ్‌వాడ్ సూచనలతో అతను తమ ఉగ్ర సంస్థను మళ్లీ పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుపుతున్నాడని తెలిపారు. భారత్‌లోని పలు జైళ్లలో ఉన్న కొందరు ఉగ్రవాదులతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పారు. పాకిస్థాన్ ఆధారిత ఖలిస్థాన్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాడని తెలిపారు.