Google Search History
Google Search History : వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ప్రియుడి సాయంతో భర్తను అంతమొందించింది. సాక్ష్యాధారాలు దొరక్కుండా హత్య నేరం నుంచి తప్పించుకోవాలని చూసింది. కానీ ఆమె గూగుల్‌లో చేసిన సెర్చ్ ఆమెను పట్టించింది. దీంతో పోలీసులు మహిళను ఆమె ప్రియుడ్ని కటకటాల్లోకి నెట్టారు.
మధ్యప్రదేశ్ లోని హర్దా జిల్లా ఖేడిపూర్ కు చెందిన తబస్సుమ్, జూన్ 18న భర్త అనుమానాస్పదంగా మరణించాడని, దొంగతనానికి వచ్చిన దుండగులు చంపి ఉంటారని పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. హత్య ఎప్పుడు జరిగిందో మహిళ కూడా చెప్పలేక పోయింది.
ఘటనా స్ధలంలో దొరికిన ఆధారాలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనానికి ఎవరూ వచ్చిన దాఖలాలు కనపడటం లేదు. ఎవరు చంపి ఉంటారో క్లూ దొరకలేదు. కేసు విచారణ మొదలైంది. విచారణలో తబ్ససుమ్ ప్రవర్తపై పోలీసులకు అనుమానం కలిగింది. ఆదిశగా విచారణ చేపట్టారు. ఆమె సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని విశ్లేషించారు. కేసులో క్లూ దొరికింది.
తబస్సుమ్ భర్త అమీర్ మహారాష్ట్రంలో పనిచేసేవాడని, భార్య ఖేడిపూర్‌లో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. తబస్సుమ్‌కు స్ధానికంగా ఉండే ఇర్ఫాన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇర్ఫాన్ తబస్సుమ్‌కు కావల్సిన ఆర్ధిక సహాయం అందిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాహేతర సంభంధం ఏర్పడింది.
ఇర్ఫాన్, ఒంటరిగా ఉన్న తబస్సుమ్‌తో తరచూ సన్నిహితంగా మెలిగేవాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా అమీర్ మహారాష్ట్ర నుంచి ఇంటికి ఖేడిపూర్ తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో తబస్సుమ్, ఇర్ఫాన్ కలుసుకోవటం కష్టంగా మారింది. తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలనుకుని ప్రియుడితో కలిసి పధకం రచించింది.
అమీర్‌కు ఆస్తమా ఉంది. అందుకోసం అతను తరచూ మందులు వేసుకుంటూ ఉంటాడు. దీనిని అవకాశంగా తీసుకున్న తబస్సుమ్ జూన్ 18 రాత్రి అతనికి అస్తమా మాత్రలకు బదులుగా నిద్రమాత్రలు ఇచ్చింది. అవి వేసుకున్నఅమీర్ గాఢనిద్రలోకి జారుకున్నాడు. పూర్తిస్ధాయి నిద్రలోకి వెళ్లాడని తెలుసుకున్న తబస్సుమ్ ప్రియుడు ఇర్ఫాన్‌ను ఇంటికి పిలిచింది. ఇద్దరూ కలిసి అమీర్‌ను హత్య చేశారు. ఘటనా స్ధలంలో ఆనవాళ్లు లేకుండా జాగ్రత్త పడ్డారు. భర్త అనుమానాస్పద స్ధితిలో మరణించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తబస్సుమ్ ఫోన్ కాల్ లిస్టు వెరిఫై చేశారు. ఆమె ఎక్కువ సార్లు ఇర్ఫాన్‌కు ఫోన్ చేసిన విషయాన్ని కనుగొన్నారు. దీంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. ఆ క్రమంలోనే పోలీసులు స్మార్ట్ ఫోన్‌లోనే గూగుల్ బ్రౌజర్‌లో హిస్టరీ చెక్ చేశారు.
అందులో ఓ వ్యక్తిని సులభంగా చంపటం ఎలా… శవాన్ని మాయం చేయటం ఎలా…. అనే నేర అంశాలపై ఎక్కువ సార్లు గూగుల్‌లో సెర్చ్ చేసిన విషయం బయట పడింది. తబస్సుమ్‌ను, ఇర్ఫాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించే సరికి నేరం ఒప్పుకున్నారు. నేరానికి ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 18 రాత్రి హత్య జరగ్గా, 24 గంటల్లోనే పోలీసులు కేసు చేధించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.