Man Died In Car Accident At Srisailam Power Plant Due To Brake Fail
Car Accident : శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ లో కారు బ్రేకులు ఫెయిలవటంతో ఒక వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ ప్లాంట్‌లో శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది. విద్యుత్ ప్లాంట్‌లో కేబుల్ మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
అక్కడ పని చేస్తున్న కార్మికులను తీసుకెళ్లేందుకు కాంట్రాక్ట్ లేబర్ శివలింగం అద్దె కారులో, డ్రైవర్ మనోజ్‌తో కలిసి ప్లాంట్ లోపలికి బయల్దేరాడు. కారులో లోపలకు వెళుతుండగా కారు బ్రేకులు ఫెయిలయ్యాయి. ప్లాంట్ అంతర్భాగం లోకి వెళ్లే ఈ మార్గం మొత్తం ఏటవాలుగా ఉండటంతో కారు వేగంగా దూసుకెళ్లి సర్వీస్ బే వద్ద ఉన్న స్పైర్ రన్నర్ ను ఢీకొట్టింది.
ఈ ఘటనతో డ్రైవర్ పక్కన కూర్చున్న శివలింగం తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. డ్రైవర్ మనోజ్‌కు తీవ్రగాయాలు కావడంతో అతడ్ని చికిత్స కోసం ఈగలపెంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.
ఏటవాలుగా ఉన్న మార్గంలో స్పీడ్ గా దూసుకు వచ్చిన వాహనం స్పైర్ రన్నర్‌ను ఢీకొట్టటంతో భారీ శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి ప్లాంటులోని కార్మికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.