Hang : తీవ్ర విషాదం.. భార్య, పిల్లలకు ఉరేశాడు.. ఆ తర్వాత

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, పిల్లలకు ఉరేసి చంపేశాడు. ఆ తర్వాత..

Hang

Man Hangs Wife And Children : మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, పిల్లలకు ఉరేసి చంపేశాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి-భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణిగుంట గ్రామానికి చెందిన పల్లపు భిక్షపతి(36)కి.. భార్య(ఉష-28), ఇద్దరు పిల్లలు(హర్షిణి-11, యశ్వంత్-7) ఉన్నారు. భిక్షపతి ఉపాధి కోసం నగర శివారు ప్రాంతానికి వలస వచ్చాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాగారం మున్సిపాలిటీలోని వెస్ట్ గాంధీనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.

కాగా, తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడని గురువారం సాయంత్రం స్థానికుడు మరికొందరితో కలిసి భిక్షపతిని కొట్టాడు. శుక్రవారం ఉదయం 8 గంటలకు భిక్షపతి ఆటోలో వెళ్తుండగా అడ్డుకుని మళ్లీ గొడవ పడి కొట్టారు. ఆటో అద్దాలు ధ్వంసం చేశారు. గొడవ తర్వాత భిక్షపతి తన ఇంట్లోకి వెళ్లాడు. ఆ తర్వాత ఎంతకూ బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు లోనికి వెళ్లి చూసి షాక్ తిన్నారు. నలుగురూ చనిపోయి ఉన్నారు. భార్య, పిల్లలకు ఉరేసిన భిక్షపతి తానూ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తమ చావుకి కారణం వారే అంటూ భిక్షపతి కొంతమంది పేర్లు ఆ లేఖలో రాసినట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా భిక్షపతి బంధువులు అడ్డుకున్నారు. వారి మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారికి నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.