ఆ ఊరికి అతడే రాజు.. మంత్రి.. అతడు చెప్పిందే వేదం, పంచాయతీ. చెప్పిందే తీర్పు.. వేసిందే శిక్ష. చట్టాలు, కోర్టులు ఉన్నా.. ఆ ఊరి పొలిమేర దాటవు. అంతా అతడి కనుసన్నల్లోనే
ఆ ఊరికి అతడే రాజు.. మంత్రి.. అతడు చెప్పిందే వేదం, పంచాయతీ. చెప్పిందే తీర్పు.. వేసిందే శిక్ష. చట్టాలు, కోర్టులు ఉన్నా.. ఆ ఊరి పొలిమేర దాటవు. అంతా అతడి కనుసన్నల్లోనే సాగుతుంది. ఏ ఇంట్లో తగువు అయినా తీరుస్తానంటూ ఊరి మధ్యలోకి చేరిపోతాడు. లేని పెద్దరికాన్ని తెచ్చుకొని కాప్ పంచాయతీలు నిర్వహిస్తాడు. కుటుంబ కలహాలతో వచ్చిన ఆడవాళ్లపై కన్నేస్తాడు.. కాదంటే తనకు నచ్చినట్టు తీర్పు చెబుతాడు. ఆ చెడ్డరాయుడి ఆగడాలు తట్టుకోలేక ఆడవాళ్లు అవస్థలు పడుతున్నారు.
ఖమ్మం జిల్లా గంధసిరి గ్రామంలో బాపు అలియాస్ రాజు అనే వ్యక్తి.. పెద్ద మనిషిగా చెలామణి అవుతున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో లేని పెద్దరికాన్ని తెచ్చుకొని ఊళ్లో రచ్చబండలు నిర్వహిస్తున్నాడు. తనకు నచ్చినట్టు తీర్పులు చెబుతున్నాడు. గుండు కొట్టించడం, అందరి ముందు ముక్కు నేలకు రాయించడం, చెప్పుతో కొట్టించడం.. ఒకటేమిటి ఆ పెదరాయుడి శిక్షలు సినిమాను తలపిస్తాయి. ఇక తిట్ల దండకానికి అదుపే ఉండదు. ఊరి నడిబొడ్డున కుర్చీ వేసుకొని కూర్చొని అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు.
ఊరి మధ్యలో మందు బాటిల్స్ ముందు పెట్టుకొని మరీ తీర్పులు చెబుతాడు. బూతులు తిడుతూ వీరంగం వేస్తాడు. అనుయాయులతో తీర్పులు అమలయ్యేలా ఎగదోస్తాడు. తన దగ్గరున్న డబ్బుతో ఏదైనా చేయొచ్చనే అహంకారంతో విర్రవీగుతాడు. తన తీర్పుకు లొంగి ఉండాలంటాడు. చాలామంది ఆ తీర్పులను వ్యతిరేకించి పోలీసులను ఆశ్రయించినా.. పట్టించుకున్న నాధుడే లేదు. దీంతో మరింత రెచ్చిపోతున్నాడు ఈ పెద్ద రాయుడు.
కుటుంబ కలహాలతో వచ్చే ఆడవారిపై కన్నేస్తాడు సదరు పెద్దమనిషి. భార్యాభర్తలు గొడవపడుతున్నారని తెలిస్తే చాలు.. తానే పిలిపించుకొని మరీ తీర్పు చెబుతానంటాడు. న్యాయం చేస్తానంటూ.. ఆడవారిని లోబరుచునే ప్రయత్నం చేస్తాడు. లొంగని వారిని హింసిస్తూ.. ఆ ఆడవాళ్లు మంచివారు కాదంటూ ప్రచారం చేస్తాడు. వారి భర్తలను తన దగ్గరే ఉంచుకొని.. తాగుబోతులుగా మారుస్తాడు. ఇలా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళలు పది మంది దాకా ఈ కీచక పెద్ద మనిషికి బలయ్యారు.
ఇలాగే ఓ మహిళ తన భర్తకు, కుమారుడికి దూరమైంది. ఆ బాధితురాలు లొంగకపోవడంతో ఈ కీచక పెదరాయుడు భార్యాభర్తలను విడదీశాడు. తన దగ్గరే ఆమె భర్తను పెట్టుకొని తాగుబోతుగా మార్చాడు. ఆమె మంచిది కాదంటూ ఊరంతా ప్రచారం చేశాడు. చివరికి కుమారుడికి కూడా దూరం చేసి.. హింసిస్తున్నాడని వాపోతోంది బాధితురాలు. ఇప్పటికైనా పోలీసులు జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని కోరుకుంటోంది.