Tamil Nadu : తమిళనాడు ఆస్పత్రుల్లో వందాలాది మంది హత్య .. విషపు ఇంజెక్షన్లతో రోగుల్ని చంపేస్తున్న వ్యక్తి

రూ. 5 వేలు ఇస్తే రెండే రెండు నిమిషాల్లో పేషెంట్లను చంపేస్తాడు. అలా 10 ఏళ్లలో వందలమంది రోగుల్ని చంపేశాడట..

Tamil Nadu

Tamil Nadu : తమిళనాడు ఆస్పత్రుల్లో గత 10 ఏళ్ల నుంచి జరుగుతున్న అత్యంత దారుణం బయటపడింది. ఆస్పత్రుల్లో రోగుల్ని విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తున్న అత్యంత భయానక సంఘటనలు ఓ వీడియో ద్వారా బయటపడ్డాయి. రోగుల బంధువుల వద్ద డబ్బులు తీసుకుని ఆయా వ్యక్తులకు సంబంధించిన రోగులకు విషపు ఇంజెక్షన్ చేసిన చంపేస్తున్న దారుణఘటనలు వెలుగులోకి వచ్చాయి. అలా 10 ఏళ్లలో 300లమంది రోగుల్ని ఓ వ్యక్తి చంపేశాడు. వారి బంధువుల నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఓ వ్యక్తి వీడియో ద్వారా ఆ దారుణాల గురించి తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి రోగుల్ని హత్య చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.

పదేళ్లుగా దాదాపు 300 మంది రోగులను హత్య చేసినట్లు ఏప్రిల్ 18న ఓ వ్యక్తి వీడియో ద్వారా తెలుసుకున్న తమిళనాడు పోలీసులు సదరు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. 34 నాలుగేళ్ల మోహన్ రాజు అనే వ్యక్తి ఈ దారుణాలు చేస్తున్నానని వీడియోలో వెల్లడించారు. దీని గురించి శుక్రవారం (ఏప్రిల్ 21,2023) పోలీసులు మీడియాకు వెల్లడించిన వివరాలు భయానకంగా ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇలా విషపు ఇంజెక్షన్లు చేస్తున్న వ్యక్తే ఈ వీడియోను విడుదల చేయటం..రోగుల బంధువుల కోరిక మేరకే తాను ఇలా వారికి ఇంజెక్షన్లు ఇచ్చి చంపేవాడిని అంటూ ఈ వీడియోలో తెలిపాడు.

నామక్కల్‌ జిల్లా పళ్లిపాలయానికి చెందిన మోహన్‌రాజ్‌ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో పనిచేసే ఓ వ్యక్తి చెప్పిన పనులు చేస్తుండేవాడు. అలా కాస్తో కూస్తో డబ్బులు సంపాదిస్తుండేవాడు. అలా అతనికి ఆ ఆస్పత్రుల్లో ఉండే రోగుల బంధువులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారిలో వయస్సు మీద పడి, ఆరోగ్యం క్షీణించిన రోగుల కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ఈక్రమంలో అటువంటి రోగులను ఆస్పత్రిలో ఉంచి వారికి సేవలు చేయటం ఇబ్బంది అనుకున్నవారు వారిని వదిలించుకోవాలనుకునేవారు మోహన్ రాజ్ తో ఉన్న పరిచయంతో వారిని చంపాలన్నట్లుగా దానికి వారు డబ్బులు ఇస్తామన్నట్లుగా తెలుస్తోంది.

సూదితో విషపు మందు వేసి హత్య చేస్తున్నానని..దాని కోసం రూ. 5 వేలు తీసుకుంటున్నానని వీడియోలో పేర్కొన్నాడు. అలా 10 ఏళ్లలో 300 మందిని విషపు ఇంజెక్షన్లతో చంపానని మోహన్‌రాజ్‌ పేర్కొన్నాడు. తమిళనాడులోని చెన్నై తో పాటు పలు ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ఇటువంటి పనులు చేశానని..అలాగే కర్ణాటకలోని బెంగళూరులో కూడా ఇటువంటివి చేయటానికి వెళ్లానని చెప్పాడు.

రూ.5 వేలు ఇస్తే రెండు నిమిషాలలో పని పూర్తి చేస్తానని పెద్ద ఘనకార్యం చేసినట్లుగా వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో పళ్లిపాలయం పోలీసులు కేసు నమోదు చేసి, మోహన్‌రాజ్‌ని అరెస్టు చేశారు. అంతేకాకుండా 18 మంది ఫేక్ డాక్టర్లతో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో నిజమేనా? లేదా వైరల్ అవ్వటానికి ఈ వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారా? అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.