మానవత్వం మంటకలుస్తోంది. విలువలు దిగజారిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా మనిషిని రాయిలా మార్చాయి. మనిషి ఎంతకు దిగజారిపోయాడంటే.. ఎదుటి వ్యక్తి
మానవత్వం మంటకలుస్తోంది. విలువలు దిగజారిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా మనిషిని రాయిలా మార్చాయి. మనిషి ఎంతకు దిగజారిపోయాడంటే.. ఎదుటి వ్యక్తి ప్రాణం పోతుంటే కాపాడాల్సింది పోయి వీడియోలు తీస్తూ, సెల్ఫీలు దిగుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఇలాంటి దారుణం ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లా హోల్దేల్‌పూర్ గ్రామంలో జామ్‌వతి(62) అనే వృద్ధురాలు నివసిస్తోంది. మూడేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో జామ్‌వతి ఒంటరిగానే నివసిస్తోంది. గురువారం(ఏప్రిల్ 16,2020) మధ్యాహ్నం ఇంటి బయట కూర్చున్న జామ్‌వతిపై పక్కింట్లో ఉండే మోను అనే దివ్యాంగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. వృద్ధురాలు బిగ్గరగా అరుస్తూ కిందపడింది. అయినా మోను ఆగకుండా వృద్ధురాలిపై కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. ఇదంతా చూస్తున్న ఓ వ్యక్తి వృద్ధురాలిని కాపాడకుండా తన మొబైల్‌లో వీడియో తీశాడు.
నిందితుడు అక్కడి నుంచి పారిపోయాక స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చే సరికి ఆమె చనిపోయింది. నిందితుడు మోనుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వృద్ధురాలి ఇంటిని లాక్కోవాలనే ఉద్దేశంతోనే నిందితుడు ఈ పని చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితునికి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తితో పాటు తోటి వ్యక్తి ప్రాణాలు పోతుంటే కాపాడాల్సింది పోయి వీడియో తీస్తూ పైశాచిక ఆనందం పొందిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.