ఈ రోజుల్లోనూ మూఢ నమ్మకాలా : ఆమె చితి మంటల్లోనే అతడిని చంపేశారు

హైదరాబాద్ శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి సజీవ దహనం సంచనలంగా మారింది. అద్రాస్ పల్లి గ్రామంలో దారుణం జరిగింది. చేతబడి అనుమానంతో ఓ యువకుడిని

  • Publish Date - September 19, 2019 / 07:02 AM IST

హైదరాబాద్ శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి సజీవ దహనం సంచనలంగా మారింది. అద్రాస్ పల్లి గ్రామంలో దారుణం జరిగింది. చేతబడి అనుమానంతో ఓ యువకుడిని

హైదరాబాద్ శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి సజీవ దహనం సంచలనంగా మారింది. అద్రాస్ పల్లి గ్రామంలో దారుణం జరిగింది. చేతబడి అనుమానంతో ఓ యువకుడిని అతి కిరాతకంగా హత్య చేశారు. చితి మంటల్లో వేసి సజీవ దహనం చేశారు. ఓ మహిళ చనిపోవడానికి చేతబడి కారణం అని నమ్మిన కుటుంబసభ్యులు దురాఘతానికి ఒడిగట్టారు. 24 ఏళ్ల యువకుడిని తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత చితి మంటల్లో వేసి సజీవ దహనం చేశారు.

వివరాల్లోకి వెళితే.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మి(45) అనే మహిళ బుధవారం చనిపోయింది. దీంతో కుటుంబసభ్యులు దహన సంస్కారాలు చేశారు. అదే సమయంలో గ్రామానికి చెందిన ఆంజనేయులు అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో ఆంజనేయులు అక్కడికి రావడంతో వారు సందేహించారు. ఆంజనేయులు చేతబడి చేసి లక్ష్మిని చంపాడని అనుమానించారు. ఆంజనేయులపై దాడి చేశారు. కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత బతికుండగానే చితి మంటల్లో వేసి సజీవ దహనం చేశారు. 

ఈ ఘటన సంచలనంగా మారింది. చేతబడి అనుమానంతో యువకుడిని లక్ష్మి బంధువులు సజీవ దహనం చేయడం దుమారం రేపింది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఘటనా స్థలం నుంచి సైంటిఫికల్ ఎవిడెన్స్ సేకరించారు. చితి నుంచి శరీర భాగాలు స్వాధీనం చేసుకుని ఫోరెనిక్స్ ల్యాబ్ కి పంపారు. ఫోరెనిక్స్ రిపోర్ట్ వచ్చాక నిజాలు వెలుగులోకి వస్తాయని, యువకుడిని సజీవ దహనం చేశారా లేదా అని తెలుస్తుందని పోలీసులు చెప్పారు. సజీవ దహనం నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఆంజనేయులు కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆంజనేయులికి ఎలాంటి పాపం తెలియదన్నారు. చేతబడి లాంటివి చెయ్యడు అని చెప్పారు. అయితే రాత్రి సమయంలో స్మశానికి ఎందుకు వెళ్లాడో తమకు తెలియదన్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.