Maoists Stil Not Handed Over Jawan Manoj Netam Dead Body
Maoists : ఛత్తీస్‌గఢ్, కాంకేర్ జిల్లాలో ఏప్రిల్ 28న కిడ్నాప్‌కు గురైన జవాన్ మనోజ్ నేతమ్‌ను హత్య చేసినట్లు మావోయిస్టులు ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. అయితే మనోజ్ మృతదేహాన్ని అనివార్య కారణాల వల్ల కుటుంబ సభ్యులకు చేరవేయనందుకు చింతిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జవాన్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అనేది మావోయిస్టులు లేఖలో తెలుపలేదు.
సాధారణంగా మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించిన అనంతరం మెజారిటీ ప్రజల తీర్పు మేరకు శిక్షలు ఖరారు చేస్తారు. ఒకవేళ మరణశిక్ష ఖరారైతే, హత్య చేసిన అనంతరం సమీప గ్రామ పొలిమేరల్లో డెడ్‌బాడీని పారేస్తారు. గ్రామస్తులు, పోలీసుల వేగుల ద్వారా పోలీసులకు సమాచారం అందుతుంది. జవాన్ మనోజ్ నేతమ్ హత్య విషయంలో ఏం జరిగిందనేది అంతు చిక్కడం లేదు. అయితే కరోనా కారణంగా ప్రజలు ప్రజా కోర్టుకు హాజరయ్యే అవకాశం లేకపోవడం, గ్రామస్తులు అటవీ ప్రాంతంలో ప్రత్యేక ఐసోలేషన్లను ఏర్పాటు చేసుకోవడం వంటి కారణాలు కనిపిస్తున్నాయి. దీంతో జవాన్ మనోజ్ హత్య పలు అనుమానాలకు తావిస్తోంది.
దండకారణ్యంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పలువురు మావోయిస్టు నేతలకు కరోనా సోకడంతో ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స కోసం నక్సలైట్లు మైదాన ప్రాంతానికి రావటం, కొంత మంది పోలీసులు ఎదుట లొంగిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.