married woman dead body found on Ghatkesar railway track in Hyderabad : మేడ్చల్ జిల్లా… ఘట్కేసర్ లో రైలు పట్టాల పక్కన ఇటీవల ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. అదీ సగం కాలిపోయి ఉంది. ఆమె దగ్గర ఫోన్ లేదు. పర్స్ లేదు. ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. ఆమెకు దాదాపు 50 ఏళ్లు ఉంటాయని మాత్రమే పోలీసులు అంచనా వేయగలిగారు. ఎంత ప్రయత్నించినా… ఆమె ఎవరన్నదీ తెలుసుకోలేకపోయారు. చివరికి… ఆమె చీర కొంగులో లభించిన ఓ కాగితం ఆ మిస్టరీని ఛేదించేందుకు ఉపయోగపడింది.
క్రైం సినిమాలు, టీవీ షో లలో వచ్చే సీఐడీ కార్యక్రమాల్లో చూపించినట్లు తాగి పడేసిన సిగరెట్ పీక, చింపేసిన టికెట్, వెంట్రుక… ఇలా ప్రతీ చిన్న వస్తువూ పోలీసులకు విచారణలో ఎంతో పెద్ద ఆధారమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఆ చిన్న ఆధారాలే సదరు కేసులను ఛేదిస్తాయి కూడా..! ఇక్కడ కూడా అచ్చం అలాంటి ఘటనే జరిగింది. కేవలం చిన్న కాగితం ముక్క… ముప్పు తిప్పలు పడుతున్న పోలీసులకు దర్యాప్తు చేసేందుకు క్లూ ఇచ్చి… కేసును ఓ దారిలో పెట్టింది.
వివరాల్లోకి వెళితే మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో జనవరి 4న అనుమానాస్పద స్థితిలో సగం కాలిన, గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమె వద్ద ఎలాంటి ఆధారం దొరకని స్థితిలో పోలీసులకు… ఆ మహిళ చీర కొంగులో ఒక ఫోన్ నంబర్ రాసి ఉన్న కాగితం లభించింది. పోలీసులు ఆ ఫోన్ నెంబరు ఆధారంగా విచారణ మొదలెట్టారు. ఆ నంబరు నేరేడ్మెట్కు చెందిన చెన్నయ్యదని గుర్తించారు. చెన్నయ్యను మల్కాజ్ గిరి ఎస్వోటీ పోలీసులు విచారించగా… సదరు మహిళతో పరిచయం ఉన్నట్టు అంగీకరించారు.
ఆ మహిళ… జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని వెంకటగిరిలో నివసించే అనంతయ్య భార్య వెంకటమ్మగా గుర్తించారు. మృతురాలిపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదై ఉంది. ఆమెది హత్యగా ప్రాథమికంగా నిర్ధారించారు. హత్య వెనక గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.
గతేడాది డిసెంబర్ 30న వెంకటమ్మ ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాకపోవడం వల్ల జనవరి ఒకటిన భర్త అనంతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు… వెంకటమ్మ ఉపయోగించిన ఫోన్ ద్వారా దర్యాప్తు చేశారు. బేగంపేట ప్రాంతంలో స్విచ్ఛాఫ్ అయినట్టు గుర్తించారు.
దర్యాప్తునకు సాంకేతికంగా ఆటంకం ఏర్పడింది. ఇదే సమయంలో వారికి గుర్తు తెలియని మహిళ మృతదేహం దొరికింది. ఆమృతదేహం విచారణలో భాగంగా మల్కాజ్ గిరి ఎస్వోటీ పోలీసులు ఇచ్చిన సమాచారంతో …జూబ్లీహిల్స్, ఘట్కేసర్ పోలీసులు సంయుక్తంగా మహిళను హత్య చేసిన నిందితుల కోసం గాలిస్తున్నారు.
వివాహేతర సంబంధం కారణంగా హత్య జరిగిందా, లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఆమె మొబైల్ నుంచి వెళ్లిన చివరి కాల్ డేటాతో పలువురిని విచారిస్తున్నారు. మరో వైపు ఆమెకు పరిచయమున్నవారిని పిలిపించి ఆరా తీస్తున్నారు. హంతకులు ఎవరన్నది త్వరలో తేలనుంది.