Jubilee Hills Robbery: జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. 2కోట్ల విలువైన వజ్రాభరణాలు, రోలెక్స్ వాచీలతో పని మనుషులు పరార్
ముందుగానే సిద్ధం చేసుకున్న కట్టర్లు, కత్తులు, ఇనుప రాడ్ల సాయంతో ఇంట్లోని అల్మారాలు పగలగొట్టారు. అల్మారాల్లో పెట్టిన దాదాపు 2 కోట్ల విలువైన 10 డైమండ్ నెక్లెస్ లు, దాదాపు 10 ఖరీదైన రోలెక్స్ చేతి గడియారాలు తీసుకెళ్లారు.
- Naveen
- Published On : March 15, 2026 / 06:05 PM IST
Jubilee Hills Robbery
- పని చేస్తున్న ఇంటికే కన్నం
- భారీ చోరీకి పాల్పడిన నేపాలీ దంపతులు
- 45 రోజుల క్రితమే వ్యాపారి ఇంట్లో పనిలో చేరిన దంపతులు
- 2 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్ లు, ఖరీదైన రోలెక్స్ వాచీలు చోరీ
Jubilee Hills Robbery: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో భారీ చోరీ జరిగింది. నేపాలీ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. పని చేస్తున్న ఇంటికే కన్నం వేశారు నేపాలీ దంపతులు. ఓ వ్యాపారి ఇంట్లో పని చేస్తున్న నేపాలీ దంపతులు దాదాపు 2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, రోలెక్స్ వాచీలు చోరీ చేశారు. 45 రోజుల క్రితమే వీరు వ్యాపారి ఇంట్లో పనిలో చేరారు. చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వ్యాపారి. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాఫ్తు చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లోని ప్లాట్ నెంబర్ 305లో పింగళి అనిరుధ్ రెడ్డి, దీపికా రెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది. వీరి ఇంట్లో దాదాపు పదేళ్లకు పైగా నేపాల్ కు చెందిన దంపతులు పని చేశారు. అయితే వీరు వాళ్ల స్వగ్రామానికి వెళ్తూ దాదాపు 45 రోజుల కిందట నేపాల్ కు చెందిన మహేశ్ షాహి, అప్సరా దంపతులను పనిలో పెట్టి వెళ్లారు. శనివారం అనిరుధ్ రెడ్డి, దీపికా రెడ్డి దంపతులు ఊటీకి వెళ్లారు. ఇదే అదనుగా మహేశ్ దంపతులు కన్నింగ్ ప్లాన్ వేశారు. అనిరుధ్ ఇంటి ఆవరణలోని సర్వంట్స్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న మహేశ్ దంపతులు రాత్రి 12 గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించారు.
ముందుగానే సిద్ధం చేసుకున్న కట్టర్లు, కత్తులు, ఇనుప రాడ్ల సాయంతో ఇంట్లోని అల్మారాలు పగలగొట్టారు. అల్మారాల్లో పెట్టిన దాదాపు 2 కోట్ల విలువైన 10 డైమండ్ నెక్లెస్ లు, దాదాపు 10 ఖరీదైన రోలెక్స్ చేతి గడియారాలు తీసుకెళ్లారు. ఇల్లు మొత్తం చిందర వందర చేశారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో పాత పని మనుషులు నివసించే ఇంట్లోకి సైతం ప్రవేశించి ఆ ఇంట్లో సైతం చోరీ చేయడానికి ప్రయత్నించారు. కాసేపటికి ఇంటికి వచ్చిన ఇతర పని మనుషులు అక్కడ వస్తువులు చిందరవందరగా పడి ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read: ఏపీలో విషాద ఘటన.. ప్రాణాలు తీసిన బైక్ పొగ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..
