KPHB Gold Scam : కేపీహెచ్బీలో భారీ గోల్డ్ స్కామ్..! రూ.10 కోట్ల మోసం వెనుక అసలు మిస్టరీ ఇదే!
KPHB Gold Scam : తక్కువ వడ్డీ అంటూ నమ్మించి ఇచ్చిన బంగారాన్ని మాయం చేశారంటూ బాధితులు ఓ ఫైనాన్స్ సంస్థపై కేపీహెచ్బీలో ఫిర్యాదు చేశారు. గోల్డ్ లోన్ పేరుతో భారీ మోసం జరిగిందంటూ 40 మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
KPHB Gold Scam
- 6 శాతం వడ్డీ మాయ.. 10 కోట్ల బంగారం మాయం
- గోల్డ్ లోన్ పేరుతో గోల్డెన్ మోసం? 40 మందికి పైగా బాధితులు
- నగలు విడిపిస్తామన్నారు.. చివరకు నగలే లేకుండా చేశారు
- బంగారం విలువ పెరిగింది.. మోసం విలువ 10 కోట్లకు చేరింది
KPHB Gold Scam : కేపీహెచ్బీలో భారీ గోల్డ్ లోన్ స్కామ్ సంచలనం సృష్టిస్తోంది. వడ్డీ తక్కువంటూ నమ్మించి బంగారాన్ని మాయం చేసిన వ్యవహారం ఇప్పుడు నగరంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ ఇప్పిస్తానంటూ ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ మేనేజర్ తమను నమ్మించి మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
నగలు విడిపిస్తామని చెప్పి చివరికి ఆ నగలే లేకుండా కాజేశారంటూ వాపోతున్నారు. సాధారణంగా గోల్డ్ లోన్‌పై14 శాతం వడ్డీ ఉంటే కేవలం 6 శాతం వడ్డీకే ఇప్పిస్తానంటూ చెప్పి 10 కోట్ల మోసం మోసం చేశారంటూ బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫైనాన్స్ సంస్థ చెప్పిన మాటలు నమ్మిన పలువురు బాధితులు తమ బంగారాన్ని అప్పగించినట్లు చెబుతున్నారు. అలా ఇచ్చిన తర్వాత తాము మోసపోయిన విషయం బయటపడిందని బాధితులు వాపోతున్నారు.
Read Also : Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిపై మరో ఫిర్యాదు.. వివాదాస్పద వ్యాఖ్యలు కొత్త చిక్కులు తెస్తాయా?
తమ బంగారాన్ని మరో ఫైనాన్స్ సంస్థకు మార్చారని, ప్రతి నెల వడ్డీ పేరుతో వ్యక్తిగత ఖాతాల్లో డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపిస్తున్నారు. మరోవైపు.. గోల్డ్ ధర పెరిగిన నేపథ్యంలో తమ పేర్లపై టాప్-అప్ లోన్లు కూడా తీసుకున్నారని, ఆ విషయం తమకు తెలియదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లోన్లు చెల్లించి గోల్డ్ విడిపించేందుకు డబ్బులు చెల్లించినా తమ నగలు తిరిగి ఇవ్వలేదని బాధితులు మండిపడుతున్నారు. మోసపోయినట్టు తెలియగానే కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి బాధితులు ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో అసలు ఎంతమంది బాధితులు ఉన్నారు? ఎంత మొత్తంలో లావాదేవీలు జరిగాయి? బంగారం ఎక్కడికి తరలించారు? అనే కోణాల్లో కేపీహెచ్‌బీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
