Guntur Trading Fraud: లక్ష పెట్టుబడి పెడితే నెలకు 10వేలు..! గుంటూరులో భారీ మోసం.. కోట్ల రూపాయలతో పరార్

మార్చి 15న అందరికీ యధావిధిగా చెల్లింపులు చేస్తానని నమ్మబలికాడు. కట్ చేస్తే 14వ తేదీ రాత్రి తన ఫ్యామిలీతో కలిసి పూర్ణచంద్రరావు ఎస్కేప్ అయ్యాడు.

  • Published On : March 18, 2026 / 12:03 AM IST
  • లక్ష పెట్టుబడి పెడితే నెలకు 10వేలు అంటూ ప్రకటన
  • భారీ మొత్తాల్లో పెట్టుబడులు పెట్టిన ప్రజలు
  • మొదట్లో నమ్మకంగా చెల్లింపులు
  • గత రెండు నెలలుగా పేమెంట్స్ నిలిపివేత
  • 14వ తేదీ రాత్రి ఫ్యామిలీతో కలిసి పరార్

Guntur Trading Fraud: లక్ష రూపాయలు పెట్టుబడిగా పెడితే నెలకు 10వేల రూపాయలు ఇస్తాం. అలా 20 నెలల చొప్పున ఇస్తాం అంటూ ఆశ చూపించారు వారాహి కన్సల్టెన్సీ నిర్వాహకులు పూర్ణచంద్రరావు. దీంతో 2వేల మందికిపైగా ప్రజలు తమకున్న దాంతో పాటు బంగారం సైతం తాకట్టు పెట్టి భారీ మొత్తంలో అతడి దగ్గర పెట్టుబడులు పెట్టారు. మొదట్లో బాగానే చెల్లింపులు జరిపాడు పూర్ణచంద్రరావు. దాంతో అందరికీ నమ్మకం కుదిరింది.

అయితే గత రెండు నెలలుగా ఇన్వెస్టర్ కి రిటర్న్స్ ఇవ్వడం లేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పెట్టుబడిదారులు వారాహి యాజమాని పూర్ణచంద్రరావుని నిలదీశారు. తన బ్యాంక్ అకౌంట్ ని ఫ్రీజ్ చేశారంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పాడు పూర్ణచంద్రరావు. అంతేకాదు మార్చి 15న అందరికీ యధావిధిగా చెల్లింపులు చేస్తానని నమ్మబలికాడు. కట్ చేస్తే 14వ తేదీ రాత్రి తన ఫ్యామిలీతో కలిసి పూర్ణచంద్రరావు ఎస్కేప్ అయ్యాడు. దీంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. తాము మోసపోయామని గ్రహించి అరండల్ పేట పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

”వారాహి కంపెనీలో జనవరి 6న 3 లక్షలు కట్టాను. అంతకుముందు కూడా కొంత డబ్బు కట్టాను. జనవరి నుంచి పూర్ణచంద్రరావు పేమెంట్స్ ఆపేశాడు. సర్వర్ బిజీ వస్తోంది, బ్యాంక్ అకౌంట్ ఆపేశారు.. ఇలా పలు కారణాలు చెప్పి డబ్బు ఇవ్వడం లేదు. రోజూ వెళ్లి మాకు రావాల్సిన డబ్బు గురించి అడిగాము. ఫిబ్రవరి 9న మీటింగ్ పెట్టారు. మా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందని చెప్పాడు. అది క్లియర్ అవ్వాలి. అందుకు టైమ్ పడుతుందని చెప్పాడు. మార్చి 15 నుంచి యధావిధిగా పేమెంట్స్ ఇస్తామని చెప్పాడు. ఏప్రిల్ 15కి అంతా క్లియర్ చేసి గతంలో ఎలా నడిచేదో అలా నడిపిస్తానని చెప్పాడు.

నేను 23 నెలల నుంచి చేసుకుంటూ వచ్చాను, ఎక్కడా ప్రాబ్లమ్ లేదు అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే మార్చి 14న అందరికీ ఇస్తానని చెప్పి ఆరోజే ఎస్కేప్ అయ్యాడు. బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేశారు అంటే కస్టమర్లు అందరూ నమ్మాము. ఆయన మాటలు నమ్మి ఆయనకు కొంచెం సమయం ఇచ్చాము. రెండేళ్ల నుంచి పేమెంట్ కరెక్ట్ గా వేస్తున్నారు కాబట్టి ఆయన మాటలు నమ్మాము. 2వేల మందిని మోసం చేసి వెళ్లాడు. అతడిని తెచ్చి మాకు అప్పగించాలి. మా డిమాండ్ అదొక్కటే” అని బాధితులు అంటున్నారు.

Also Read: రోగులకు మత్తు ఇచ్చి బంగారం దోపిడీ, భర్తతో కలిసి ఆసుపత్రుల్లో చోరీలు.. హైదరాబాద్‌లో నకిలీ లేడీ డాక్టర్ అరెస్ట్