కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మసీదుపురంలో దారుణం జరిగింది. కన్నతల్లే కర్కశంగా ప్రవర్తించింది. తన ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పిల్లలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారు. కుటుంబకలహాలే దీనికి కారణం అని తెలుస్తోంది. నర్సింహులు, పద్మావతి దంపతులు కొంత కాలంగా గొడవ పడుతున్నారు. భర్తతో విసిగిపోయిన పద్మావతి.. పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో, నిద్రపోతున్న తన ఇద్దరు పిల్లలు సంజీవ్(2), మనోజ్(3) లపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. తాను కూడా పెట్రోల్ పోసుకుంది. నిప్పు పెట్టుకోవాలని చూసింది. ఇంతలో మంటల బాధ తట్టుకోలేక పిల్లలు కేకలు వేయడంతో భయపడిన పద్మావతి.. నిప్పు పెట్టుకోలేక పోయింది.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తల్లి తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే ఇలా చెయ్యడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భర్త మీద కోపం పిల్లలపై చూపడాన్ని తప్పుపడుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.