భార్యను చంపి, శవంతో రెండు రోజులు నిద్రించిన కిరాతకుడు

  • Publish Date - July 9, 2020 / 09:13 AM IST

కుటుంబ కలహాల నేపధ్యంలో భార్యను హత్య చేసి, ఆ శవాన్ని ఇంట్లోనే దాచి పెట్టి రెండు రోజుల పాటు నిద్రపోయిన కిరాతకుడి ఉదంతం మధ్య ప్రదేశ్ లో వెలుగు చూసింది.

భోపాల్ కు 186 కిలోమీటర్లు దూరంలోని సాగర్ అనే గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. నిందితుడి ఇంటి నుంచి దుర్వాసన రావటంతో ఇరుగు పొరుగు వారు ఫిర్యాదు చేయటంతో పోలీసులు వచ్చి చూడగా మృతదేహం బయట పడింది.

షేర్ సింగ్ అహిర్వార్ అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయమై భార్య ఆర్తి అహిర్వార్(32) తో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. వారికి 10 ఏళ్ళ కుమారుడు ఉన్నాడు. ఆర్తి తల్లితండ్రులు కూడా అదే ప్రాంతంలో నివసిస్తున్నారు.

జులై4 శనివారం రాత్రి తాగి వచ్చిన షేర్ సింగ్ భార్య ఆర్తితో గొడవపడ్డాడు. ఈ గొడవలో ఆవేశం పట్టలేక షేర్ సింగ్ భార్య ఆర్తిని గొడ్డలితో నరికి చంపాడు. కాసేపటికి మత్తు దిగి భార్యను చంపిన విషయం గ్రహించాడు. ఆమె శవాన్ని ఒక చెక్క పెట్టెలో పెట్టి దాని మీద మంచం వేసుకుని పడుకున్నాడు. పడుకునే ముందు మరో సారి మద్యం సేవించాడు.

ఆదివారం అతని ఇంటి నుంచి దుర్వాసన రావటంతో ఇరుగు పొరగు వారు పోలీసులకు సమచారం ఇచ్చారు. సోమవారం ఉదయం వచ్చిన పోలీసులకు షేర్ సింగ్ మద్యం మత్తులో కనిపించాడు. అతని ఇంటిని సోదా చేసిన పోలీసులకు చెక్క పెట్టెలో పెట్టిన ఆర్తి శవం లభ్యం అయ్యింది.

పోలీసులు శవాన్ని పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే మద్యం మత్తులో భార్యను హత్యచేసినట్లు నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. పోస్టు మార్టం అనంతరం శవాన్ని ఆమె తల్లి తండ్రులకు అప్పగించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు.

Read Here>>లాక్‌డౌన్ మీలోనూ ఈ మానసిక సమస్యలు తెచ్చిందా.. చెక్ చేసుకోండి