76ఏళ్లుగా గాలి మాత్రమే పీల్చి బతికిన యోగి కన్నుమూత
- venkaiahnaidu
- Published On : May 26, 2020 / 03:24 PM IST
76 ఏళ్లుగా గాలి మాత్రమే పీల్చుతూ బతికిన యోగి..ప్రహ్లాద్ జాని అలియాస్ చునిర్వాలా మాతాజి మంగళవారం(మే-26,2020)ఉదయం కన్నుమూశారు. 70ఏళ్లుగా అన్నపానీయాలు ముట్టుకోకుండా జీవిస్తున్న ఆయన గుజరాత్ లోని గాంధీనగర్ జిల్లాలోని తన స్వగ్రామం చారదాలో 90ఏళ్ల వయస్సులో ఇవాళ తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితం తన స్వగ్రామంలో కొంత సమయం గడపాలని నిర్ణయించిన ప్రహ్లాద్ జాని తన సొంతూరికి వెళ్లి ఇవాళ ఉదయం చనిపోయారు.
భక్తుల సంర్శనార్థం ఆయన మృతతదేహాన్ని రెండు రోజుల పాటు బనస్కంతలోని ఆశ్రమంలో ఉంచనున్నారు. గురువారం ఆశ్రమంలో ఆయన సమాధి కార్యక్రమం జరగనుంది. గుజరాత్ రాష్ట్రంలో ప్రహ్లాద్ జానికి పెద్ద ఫాలోయింగ్ ఉండేది. ఆయన పేరు తెలియని వారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. తిండీ, నీళ్లు లేకుండా తాను జీవిస్తున్నట్లు ఆయన చెప్పడంతో 2003లో మరియు 2010లో అతనిపై ఎంతోమంది శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. అందులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ కూడా ఒకరు. ఏమీ తినకుండా ఎలా జీవిస్తున్నారో అర్థంకాక చాలా మంది సైంటిస్టులు తలలు పట్టుకున్నారు. ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ అసలు కారణాన్ని మాత్రం రాబట్టలేకపోయారు.
అయితే ధ్యానమే తనను బతికిస్తోందని, దేవత తనను సంరక్షిస్తున్నందును తనకు ఆహారం లేదా నీరు అవసరం లేదని అతను తరుచూ చెప్తుండేవాడు. అంబా దేవత భక్తుడినని చెప్పే ఆయన..ఎప్పుడూ ఎర్ర చీర(చున్రి)ధరించే మహిళల మాదిరిగా వేషధారణలో ఉండేవాడు. అందువల్లే ఆయనను చునిర్వాలా మాతాజి గా పిలుస్తారు. ఆధ్యాత్మిక అనుభవం కోసం ఆయన చిన్నతనంలోనే ఇళ్లు విడిచి వెళ్లిపోయాడు. 14ఏళ్ల వయస్సు నుంచే ఆయన ఆహారం,నీరు తీసుకోవడం మానేసినట్లు ఆయన ఫాలోవర్స్ చెబుతారు.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 2010లో డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్(DIPAS)ప్రహ్లాద్ జానిపై ఓ అధ్యయనం నిర్వహించాయి. అందులో భాగంగా ఆయనను15 రోజుల పాటు ఒక గదిలో ఉంచి వీడియో మానిటరింగ్ నిర్వహించారు. అనంతరం ఎమ్ఆర్ఐ, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, తదితర వైద్య పరీక్షలు జరిపారు. ఈ ఫలితాల్లో ఆయనకు అసాధారణ రీతిలో ఆకలి, దాహాన్ని తట్టుకునే లక్షణాలున్నాయని తేలింది. కాగా ఆయన ఆశ్రమాన్ని సందర్శించిన వారిలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారు.
