NEET Aspirant Ends Life: నీట్ పరీక్ష రద్దు.. తీవ్రమైన ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య..!
NEET Aspirant Ends Life: నీట్ పరీక్ష రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.
- Naveen
- Updated on- May 15, 2026 / 06:46 PM IST
NEET Aspirant Ends Life: నీట్ ఎగ్జామ్ రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పేపర్ లీక్ అయిందన్న కారణంతో నీట్ పరీక్షను రద్దు చేసింది కేంద్రం. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. నీట్ పరీక్ష రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
మరోవైపు నీట్ పరీక్ష రద్దు ఒక విద్యార్థి ప్రాణం తీసింది. పేపర్ లీక్ కారణంతో నీట్ పరీక్షను రద్దు చేయడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పేపర్ లీక్ ఆరోపణల కారణంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేయడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీకి చెందిన రితిక్ మిశ్రా గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మూడోసారి నీట్ రాశాడు. అయితే, ఈ ప్రయత్నం కూడా అకస్మాత్తుగా రద్దవడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడని, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబం ఆరోపిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. మే 3న నీట్ నిర్వహించారు. 22 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. అయితే పేపర్ లీక్ ఆరోపణలతో ఎగ్జామ్ ను రద్దు చేశారు. జూన్ 21న తిరిగి నీట్ పరీక్ష నిర్వహించనున్నారు.
రితిక్ మిశ్రా బలవన్మరణంతో అతడి ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. విద్యా మంత్రిత్వ శాఖ, NTA వైఫల్యం, దుర్వినియోగం కారణంగా మరో యువ కల కనుమరుగైందని వాపోయారు. నీట్ అభ్యర్థి రితిక్ మిశ్రా విషాద మరణం యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఒత్తిడి, అనిశ్చితి, మానసిక క్షోభతో ఒక యువ జీవితం శాశ్వతంగా మూగబోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎంతమంది విద్యార్థులను బలి తీసుకుంటారు అని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. పరీక్షలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించడంలో కేంద్రం విఫలమైందని విపక్షాలు, విద్యార్థి సంఘాలు ధ్వజమెత్తాయి. విద్యార్థులు యంత్రాలు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
