AE Nukaraju Case : ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. అల్లుడిని సాధిక్‌ఖాన్‌ హత్య చేశాడా?!

AE Nukaraju Case : పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. సాధిక్‌ఖాన్‌పై అల్లుడి హత్య కేసు నమోదుకాగా, కీలక లేఖలు బయటకు వచ్చాయి.

AE Nukaraju Family Tragedy

  • ఏఈ నూకరాజు కుటుంబ విషాదంలో కీలక మలుపు..
  • కుటుంబ ఆత్మహత్య వెనుక వేధింపులా? వెలుగులోకి అల్లుడి డెత్ మిస్టరీ
  • గోదావరిలో విషాదం.. ఇప్పుడు అల్లుడి మృతిపై అనుమానాలు
  • జగదీశ్‌రెడ్డిని సాధిక్ ఖాన్ హత్య చేశాడంటూ ఫిర్యాదు 

AE Nukaraju Case : పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ తిల్లపూడి నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే నూకరాజు కుటుంబ ఆత్మహత్యకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్‌ సాధిక్‌ఖాన్‌పై తాజాగా మరో కేసు నమోదైంది. నూకరాజు వియ్యంకుడు భాస్కర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసును పోలీసులు నమోదు చేశారు. నూకరాజు అల్లుడు జగదీశ్‌రెడ్డి మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

జగదీశ్‌రెడ్డి మృతిపై అనుమానాలు :
జూలై 2న తన కుమారుడు జగదీశ్‌రెడ్డికి సాధిక్‌ఖాన్‌ పాయిజన్‌ ఇంజెక్షన్‌ ఇచ్చి హత్య చేశాడని భాస్కర్‌రెడ్డి ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఘటనలో సాధిక్‌ఖాన్‌తో పాటు మరో వ్యక్తి ప్రమేయం కూడా ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మనవడు కార్తికేయరెడ్డితో మాట్లాడాకే అసలు విషయం తెలిసిందని పోలీసులకు వివరించారు. దాంతో జగదీశ్‌రెడ్డి మృతి వ్యవహారం ఇప్పుడు మరింత కీలకంగా మారింది.

సాధిక్‌ ఖాన్‌ వేధింపులు వల్లే ఆత్మహత్య.. :

మరోవైపు, నూకరాజు కుమార్తె సౌజన్య వాహనంలో కూడా పోలీసులు 3 కవర్లను గుర్తించారు. అందులో జగదీశ్‌రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సౌజన్య రాసిన లేఖను పోలీసులకు దొరికినట్టు తెలిసింది. సాధిక్‌ఖాన్‌ తనను బెదిరించాడని, బ్లాక్‌మెయిల్‌ కూడా చేశాడని ఆమె లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

తన ఆస్తి, ఫోన్‌, ఎస్‌బీఐ లాకర్‌ వివరాలను కూడా సాధిక్‌ లాగేసుకున్నాడని, మతం మారాలని ఒత్తిడి చేశాడని లేదంటే తన ఫ్యామిలీని చంపేస్తానంటూ బెదిరించాడని ఆమె లేఖలో ఆరోపించినట్లు సమాచారం.

Read Also : America Voter ID Debate : ఇండియా తరహా ఓటర్ ఐడీ అమెరికా వల్ల అవుతుందా?

అలాగే, నూకరాజు కూడా కుటుంబ ఆత్మహత్యకు ముందు లేఖ రాశారు. తన అల్లుడు జులై 2న మరణించాడని, ఆ తర్వాత కుమార్తెకు సాయం చేస్తానంటూ సాధిక్‌ నమ్మబలికాడని, అయితే అందుకు అంగీకరించలేదని పేర్కొన్నారు.

తన కుమార్తెను పదేపదే బెదిరిస్తూ వస్తువులు, బ్యాంకు ఖాతాల వివరాలు సాధిక్‌ బలవంతంగా తీసుకున్నాడని ఆరోపించారు. అతడి వేధింపులు భరించలేకే ఫ్యామిలీతో కలిసి ఈ నిర్ణయం తీసుకుంటున్నామని, సాధిక్‌ను కఠినంగా శిక్షించాలని కలెక్టర్‌, ఎస్పీలను కోరుతూ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

గోదావరిలో దూకి ఆత్మహత్య :
నూకరాజు వచ్చే జనవరిలో రిటైర్ అవ్వాల్సి ఉంది. ఆదివారం అర్ధరాత్రి భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు రియాన్ష్‌ కార్తికేయరెడ్డితో కలిసి రాజమహేంద్రవరం చేరుకున్నారు. రోడ్డు కం రైలు వంతెనపై కారు నిలిపి నలుగురూ గోదావరిలోకి దూకారు.

కార్తికేయ ఈత కొడుతూ సాయం కోసం కేకలు వేయడంతో మత్స్యకారులు అతడ్ని రక్షించారు. సోమవారం సాయంత్రం నూకరాజు మృతదేహాన్ని గుర్తించారు. మీనా, సౌజన్య కోసం గాలింపు ముమ్మరం చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సాధిక్‌ఖాన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అల్లుడి మృతి కేసు దర్యాప్తు కూడా మరింత వేగం పుంజుకుంది.