నిర్భయ కేసు..ఉరి బిగిసేనా? : తీహార్‌కు చేరుకున్న తలారీ

  • Publish Date - January 31, 2020 / 12:59 AM IST

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 2020, ఫిబ్రవరి 1న నలుగురు దోషుల్ని ఉరి తీయాలంటూ పటియాలా హౌస్‌కోర్ట్‌ డెత్‌ వారెంట్‌ జారీ చేయడంతో… అందుకోసం తీహార్‌ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉరిశిక్ష అమలుకు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. శిక్షను అమలుపర్చేందుకు తలారీ పవన్‌ జల్లాద్ తీహార్‌ జైలుకు చేరుకున్నాడు.

జైలు ప్రాంగణంలో ఆయన కోసం ప్రత్యేక గది, వసతి ఏర్పాట్లు చేశారు. తలారి పవన్‌ జల్లాద్ జైలు ప్రాంగణంలోనే ఉండి ఉరితాడు సామర్థ్యంతో పాటు ఇతర విషయాలను పరిశీలిస్తారని అధికారులు వెల్లడించారు. ఉరితీత సన్నాహాల్లో భాగంగా 2020, జనవరి 31వ తేదీ శుక్రవారం పవన్‌ డమ్మీ ఉరిని నిర్వహించనున్నారు. తలారి పవన్‌ జల్లాద్‌ మీరట్ వాసి. నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేయాలంటూ పవన్‌ తీహార్‌ జైలు అధికారులు అభ్యర్థించారు.

జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు పవన్‌ సేవల్ని అందించాలని కోరడంతో ఆయన తీహార్‌ కారాగారానికి చేరుకుని ఉరితీతకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. న్యాయపరమైన చిక్కులేవీ ఎదురుకాకుండా వుంటే నిర్భయ కేసులో నలుగురు దోషులైన పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మకు ఫిబ్రవరి 01వ తేదీన ఉరిశిక్ష అమలు కానుంది. ఉదయం ఆరు గంటలకు తీహార్ జైల్లో నలుగురిని ఉరి తీసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కొద్దిరోజుల ముందు నిర్భయ దోషులకు ఉరి వేసేందుకు జైలు అధికారులు ట్రయల్స్‌ నిర్వహించారు. ఇందుకోసం బక్సర్ నుంచి తాళ్లను తెప్పించినట్లు సమాచారం. మూడో నంబర్‌ జైలులో నిర్భయ దోషులు నలుగురిని ఏకకాలంలో ఉరి తీయనున్నారు. 

* తమకు విధించిన ఉరిశిక్ష అమలు కాకుండా ఆపేందుకు నిర్భయ దోషులు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారు.
* తాజాగా నిర్భయ దోషి అక్షయ్‌కుమార్‌ వేసుకున్న క్యురేటివ్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
* ఫిబ్రవరి 1న అమలు కానున్న ఉరిశిక్షపై స్టే విధించాల్సిందిగా అతడు వేసిన మరో పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
* మరో నిందితుడు వినయ్‌ శర్మ రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
* ఈ నేపథ్యంలో నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలవుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.

Read More : KTRకు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం