జనగామ ప్రభుత్వాస్పత్రిలో కరోనా కలకలం రేపుతోంది. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి ఆస్పత్రి నుంచి పరార్ అయ్యారు.
జనగామ ప్రభుత్వాస్పత్రిలో కరోనా కలకలం రేపుతోంది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఓ యువకుడు చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చాడు. అతడిని పరిశీలించిన వైద్యులు కరోనా లక్షణాలు ఉన్నట్లు భావించారు. పైగా అతను రెండు రోజుల క్రితం దుబాయ్ నుంచి రావడంతో వైద్యుల అనుమానం మరింత బలపడింది. దీంతో కరోనా వైరస్ టెస్టులు చేయించుకోవాలని వైద్యులు అతనికి సూచించారు. అందుకు నిరాకరించిన యువకుడు స్నేహితులతో కలిసి ఆస్పత్రి నుంచి పరార్ అయ్యాడు. లింగాల ఘనపురం మండలానికి చెందిన యువకుడిగా గుర్తించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. వరంగల్ అర్బన్ జిల్లాలోని ఎంజీఎంలో, జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు కరోనా అనుమానితులు చేరారు. ఇద్దరు కరోనా అనుమానితులు ఆస్పత్రిలో చేరారన్న విషయంలో రెండు జిల్లాల్లో కలకలం రేపుతోంది.(కరోనా భయం….విదేశీ భక్తుల రాకపై ఇస్కాన్ నిషేధం)
జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం ఆర్టీసీ కాలనీకి చెందిన సూర చందు దుబాయ్ నుంచి వచ్చాడు. రెండు రోజుల తర్వాత తనకు కరోనాకు సంబంధించిన లక్షణాలు బయటపడటంతో భయాందోళన చెందిన వ్యక్తి తన ఇద్దరి స్నేహితులతో కలిసి జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. వెంటనే అప్రమత్తమైన వైద్యులు అతనికి చికిత్స చేసి పూర్తి స్థాయిలో నిర్ధారణకు వచ్చే క్రమంలో కరోనాకు సంబంధించి భయాందోళనకు గురై అతని స్నేహితులతో కలిసి ఆస్పత్రి నుంచి పరార్ అయ్యాడు.
దీనికి సంబంధించి సమాచారం తెలుసుకున్న ఆస్పత్రి వైద్యులు అతన్ని వెతికే పనిలో పడ్డారు. ఆ వ్యక్తికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. కరోనా పట్ల భయపడాల్సిన పని లేదని, ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకోవాలని సూచించారు. ట్రీట్ మెంట్ కు సహకరించాలని అతనితో వైద్యులు ఫోన్ లో మంతనాలు జరుపుతున్నారు.
ఇదిలావుండగా వరంగల్ ఎంజీఎంలో మరో కరోనా అనుమానిత కేసు నమోదు అయింది. అతను ఇటలీ నుంచి ఇక్కడి వచ్చినట్లు సమాచారం. అతన్ని హైదరాబాద్ కు రెఫర్ చేశారు. వైద్య పరీక్షలు చేసి, అతనికి చికిత్స అందించనున్నారు.