Dharmavaram Terror Links Case: ధర్మవరం ఉగ్రలింకుల కేసు.. నూర్ వాట్సాప్ గ్రూపుల పరిశీలన.. ఉగ్రవాదులతో ఏం చర్చించాడంటే..

ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్ పై దేశద్రోహం కింద కేసు నమోదైంది. 4 రోజుల క్రితం నూర్ ను అదుపులోకి.. (Dharmavaram Terror Links Case)

Dharmavaram Terror Links Case: ధర్మవరం ఉగ్రలింకుల కేసు.. నూర్ వాట్సాప్ గ్రూపుల పరిశీలన.. ఉగ్రవాదులతో ఏం చర్చించాడంటే..

Updated On : August 18, 2025 / 12:37 AM IST

Dharmavaram Terror Links Case: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఉగ్రలింకుల కేసులో పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. నిందితుడు నూర్ మహమ్మద్ వాట్సాప్ గ్రూపులను పోలీసులు పరిశీలిస్తున్నారు.

దేశ వ్యతిరేక ప్రచారం, జిహాదీ ప్రేరణకు సంబంధించిన అంశాలపై వాట్సాప్ గ్రూపుల్లో నూర్ చర్చించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఉగ్రవాద సంస్థల్లో నూర్ పాత్ర ఏంటి అన్న అంశంపై ఆరా తీస్తున్నామని సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు.

అవసరమైతే నూర్ మహమ్మద్ ను కస్టడీకి తీసుకుంటామన్నారు.

ఉగ్రవాద కదలికలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. విజయనగరం, రాయచోటి ఘటనలు మరువకముందే శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రలింకులు బయటపడ్డాయి.

నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడికి ఉగ్ర సంస్థలతో లింకులు ఉన్నట్లుగా గుర్తించారు.

ఈ కేసులో నూర్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కదిరి కోర్టు తీర్పు చెప్పింది. దీంతో పోలీసులు నూర్ ను కడప సెంట్రల్ జైలుకి తరలించారు.

నూర్ పై దేశద్రోహం కేసు..
ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్ పై దేశద్రోహం కింద కేసు నమోదైంది. 4 రోజుల క్రితం నూర్ ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు పాక్ ఉగ్రవాదులతో నూర్ టచ్ లో ఉన్నట్లుగా గుర్తించారు.

టెర్రరిస్టులతో ఫోన్ కాల్స్, చాటింగ్ చేసినట్లుగా విచారణలో తెలుసుకున్నారు.

ఇక దాదాపు 29 ఉగ్రవాద సంస్థల గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్న నూర్ మహమ్మద్ ఇక్కడి యువతను టెర్రరిజం వైపు మళ్లిస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో అతడిపై దేశద్రోహం, యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేశారు.(Dharmavaram Terror Links Case)

పక్కా సమాచారంతో నూర్ అరెస్ట్..
ఉగ్ర కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో నూర్ ను అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరంలోని నూర్ ఇంట్లో తనిఖీలు చేశారు. నూర్ మహమ్మద్ ఓ హోటల్ లో వంట మాస్టర్ గా పని చేస్తున్నాడు.

ఇటీవల కుటుంబంతో గొడవ పడిన నూర్ ఇంటి నుంచి వెళ్లిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. అతడి దగ్గర 16 సిమ్ కార్డులు గుర్తించారు అధికారులు. అలాగే పాకిస్తాన్ టెర్రర్ గ్రూపుల్లో యాక్టివ్ గా ఉన్నట్లుగా నిర్ధారించుకున్నారు. మొత్తం టెర్రర్ లింకులను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read: వామ్మో.. స్పీకర్స్‌లో 2కిలోల పేలుడు పదార్ధాలు నింపి పెళ్లి గిఫ్ట్‌గా ఇచ్చాడు.. పెళ్లి కొడుకు మర్డర్‌కు ఖతర్నాక్ ప్లాన్..