police Case registered against TDP MLA vallabhaneni vamshi
అనేక ఆరోపణలతో టీడీపీ నేతలు కేసుల్లో చిక్కుకుంటున్నారు. మరో టీడీపీ నేతపై కేసు నమోదైంది. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై కేసు నమోదు చేశారు. ఎమ్మార్వో నరసింహరావు ఫిర్యాదు మేరకు హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఓటర్లకు నకిలీ పట్టాలు పంపిణీ చేశారని ఎమ్మెల్యే వంశీపై ఫిర్యాదు చేశారు. 2019 ఏప్రిల్ నెలలో జరిగిన ఎన్నికల్లో స్థానికంగా పేదలకు ఫోర్జరీ సంతకాలతో తయారు చేసిన ఇళ్ల పట్టాలను అందించారని ఆయనపై అభియోగం ఉంది. తన సంతకం ఫోర్జరీ చేసి పేదలను మోసగించారంటూ ఎమ్మార్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎలాగైన గెలవాలనే ఉద్దేశంతో అక్కడ పేద ప్రజలను ఏమార్చి ఏకంగా ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని వంశీపై ఫిర్యాదులొచ్చాయి. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా వంశీ తన అనుచరులతో కలిసి బాపులపాడు మండలం పెరికీడు, కొయ్యూరు, కోడూరుపాడు, బాపుల పాడు తో సహా అనేక గ్రామాల్లో పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలను వేల సంఖ్యలో పంపిణీ చేశారు.
గతంలో అక్కడ పని చేసి వెళ్లిన తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జీర చేసి..ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా నమ్మించి ఓటర్లకు అందించారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావటంతో ప్రాథమికంగా విచారణ జరిపారు. దీని పైన బాపులపాడు ఎమ్మార్వో నరసింహారావు చేసిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే వంశీతో పాటుగా ఆయన ప్రధాన అనుచరులపై హనుమాన్ జంక్షన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కేవలం ఎన్నికల్లో గెలవటంతో కోసమే ఇలా నకిలీ పట్టాలను పేదలకు అందించారని ..అందునా ప్రభుత్వ అధికారి సంతకం ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో వెల్లడించారు.
ఇప్పటికే టీడీపీ నేత చింతమనేని తన మీద నమోదైన కేసుల కారణంగా జైళ్లో ఉన్నారు. ఇక వైసీపీ నుండి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వెంకట రమణ, కూన రవి కుమార్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదవ్వడంతో రాజకీయంగా మరో టర్న్ తీసుకొనే అవకాశం ఉంది.