టీడీపీ నేత సీఎం రమేష్ ఇంట్లో పోలీసుల సోదాలు

  • Publish Date - April 5, 2019 / 02:12 AM IST

కడప : ఎన్నికల  వేళ పోలీసులు స్పీడ్ పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. భారీగా నగదు, మధ్యం పట్టుడుతోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే అక్రమంగా భారీ మొత్తంలో డబ్బులు తరలిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. ఏప్రిల్ 5 శుక్రవారం రాజ్యసభ సభ్యుడు, టీడీపీ నేత సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎన్నికల్లో పంపిణీ చేయడానికి ఆయన ఇంట్లో డబ్బులు దాచారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసులు సీఎం రమేష్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. స్థానిక సిఐ ఆధ్వర్యంలో నాలుగు బృందాలతో తనిఖీలు చేస్తున్నారు. 60 మంది పోలీసులు సోదాల్లో పాల్గొన్నారు. కడప ఎస్పీ అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు సోదాలు నిర్వహిస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. 

కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సీఎం రమేష్ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఏడు మంది టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం ఆయన ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం రమేష్ ఆధ్వర్యంలోనే ఎన్నికల్లో డబ్బుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆయన ఇంటి నుంచే డబ్బులు సరఫరా అవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడా డబ్బుల ప్రభావం లేకుండా చేసేందుకే ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. అయితే సీఎం రమేష్ ఇంట్లోనే ఉన్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.